Social Media: ఇక నుంచి సోషల్ మీడియాలో అడ్డగోలుగా కామెంట్స్ చేసే వాళ్లు తస్మాత్.. జాగ్రత్త అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడిన ఆయన, సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన కామెంట్స్ చేసినా, మహిళల వ్యక్తిగత హనానానికి పాల్పడే వారినైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హెచ్చరించారు. ఇటీవల ఏపీలో కూడా సోషల్ మీడియా పై నిఘా పెంచిన అక్కడి ప్రభుత్వం కేటుగాళ్లను అరెస్టు చేస్తోంది ఈ నేపథ్యంలో ఏపీ లాంటి పరిస్థితులే ఇక్కడ కూడా తలెత్తనున్నాయనే సందేహం కలుగుతోంది.
సోషల్ మీడియాలో (Social Media) హద్దు మీరుతున్న వారిపై ఇక ఏమాత్రం కనికరం చూపబోమని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిచారు. ఇటీవల ఇద్దరు మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు విషయలో బీఆర్ఎస్ వైఖరిపై సీఎం మండిపడ్డారు. పార్టీ ఆఫీసుల్లో కొందరు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని జుగుప్సాకరమైన పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. వారు పెట్టిన పోస్టులు అసభ్యకరంగా ఉన్నందునే ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారని తెలిపారు. దానికి బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుందని విమర్శించారు.
Also Read:
CM Revanth Reddy pic: బీఆర్ఎస్.. గతం మరచిపోతే ఎలా? రేవంత్ ను ఎండలో నిలబెట్టి మరీ..
ఈ అంశంపై బీఆర్ఎస్ ను ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ‘‘సోషల్ మీడియాలో పెట్టిన భాష ఓ సారి వినండి. జర్నలిస్టుల ముసుగులో మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇష్టారీతిలో తిట్టిస్తున్నారు. ముఖ్యంగా మహిళల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నామని, ఆ భాష వింటే రక్తం మరుగుతుందన్నారు. ‘‘మీరసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటారా?’’ అంటూ సీఎం కాస్త ఆవేదనభరితంగా ప్రసంగించారు.
కుటుంబ సభ్యుల గురించి జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే, అనరాని మాటలు అంటుంటే నొప్పి ఎవరికైనా కలుగుతుందన్నారు. భార్య, బిడ్డల్ని తిడుతుంటే ఎవరు తట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. రాజకీయ జీవితంలో ఉన్నది తామని, విమర్శించాలంటే తమను విమర్శించాలి తప్ప కుటుంబం జోలికి పోవడమేంటని ఆగ్రహించారు.
సీఎంగా చెప్తున్నా.. ఇక నుంచి శృతి మించి ప్రవర్తిస్తే ఊరుకొనేది లేదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అలాంటి వారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుందామని అనుకుంటున్నారేమో.. అవసరమైతే చట్టాన్ని సవరిస్తామన్నారు. అంతేగాని క్షమించే ప్రసక్తే లేదని, ఉక్కుపాతరేస్తామని స్పష్టం చేశారు. దీనిని బట్టి ఏపీలో సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు అమలు చేసిన ప్లాన్, తెలంగాణలో అమలు కానుందని చెప్పవచ్చు. ఇక నుండి.. సోషల్ మీడియాలో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్నారా? పోస్ట్ చేస్తున్నారా? పోలీసులు ఓ కంట కనిపెట్టేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.