Telangana CM Revanth Reddy
తెలంగాణ

CM Revanth Reddy pic: బీఆర్ఎస్.. గతం మరచిపోతే ఎలా? రేవంత్ ను ఎండలో నిలబెట్టి మరీ..

CM Revanth Reddy pic: ఓ వైపు ఎండలు మండిపోతున్నాయ్.. దానికి మించి తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్బంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదాలు తీవ్ర రూపం దాల్చడం, స్పీకర్ ను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేశారని సభ నుంచి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం తీవ్ర దుమారానికి దారి తీసాయి. అయితే ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ను బీఆర్ఎస్ రాజకీయంగా అనుకూల వాతావరణంలోకి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలుగా తమకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేవలం గళమెత్తినందుకే సస్పెండ్ చేయలేదా? ఆ సంగతి గుర్తులేదా? అంటూ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. అప్పట్లో తన సస్పెన్షన్ కు నిరసనగా రేవంత్ రెడ్డి మండుటెండలో నిలబడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

2017 మార్చిలో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయం అది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి కేవలం తన సీటు వద్దనే ఉండి మరీ అడ్డు తగిలారు.ఆయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా ఆయనతో పాటు గళమెత్తారు.అప్పుడు రేవంత్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. రేవంత్ తో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను సైతం అసెంబ్లీ నుండి బహిష్కరణకు గురయ్యారు.

తన సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ రేవంత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ ఆవరణంలో ఎర్రటి ఎండలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సభ్యుడిగా ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డ రేవంత్ రెడ్డి.. నేడు సభా నాయకుడి(సీఎం) స్థాయికి ఎదిగిన విషయం మనందరికీ తెలిసిందే.

వాస్తవానికి నాడు అధికార పక్షమైన బీఆర్ఎస్ .. సభలో ప్రతిపక్షాల పట్ల వ్యవహరించిన తీరు అందరికి తెలిసిందే. గళమెత్తితే సస్పెన్షన్ లు, నిలదీస్తే బహిష్కరణలే ఉండేవి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యులను ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు. గత ప్రభుత్వ సభలో ప్రతిపక్షాలుగా తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా భావించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ సాక్షిగా ఇదే విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తూ వచ్చారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎవరి పైనా వేటు వేయలేదు. కానీ ఇటీవల జగదీశ్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదస్పదమైన నేపథ్యంలోనే అనివార్య పరిస్థితుల్లో ఆయనను సస్పెండ్ చేయవలసి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మార్చి 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనితో సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని, స్పీకర్‌ ఆయనను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ ను జగదీశ్ రెడ్డి ఏకవాక్యంతో సంభోదించారని, ఆయన సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Heatwave alert: ఆ జిల్లాలలో మండే ఎండలు.. వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ..

ముందే చెప్పినట్లు ఈ సస్పెన్షన్ ను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుండగా.. కాంగ్రెస్ దాన్ని తప్పుబడుతోంది. బీఆర్ఎస్ హయాంలో గళమెత్తినందుకే బహిష్కరించేవారని, ఆ పార్టీ గతంలో చేసిన తప్పిదాలు మరచిపోతే ఎలా? అంటూ కాంగ్రెస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.అలాగే 2017లో అసెంబ్లీ నుండి బహిష్కరణకు గురైన రేవంత్ రెడ్డి, ఎండలో అసెంబ్లీ ముందు నిలబడ్డ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. నేటి అసెంబ్లీ సమావేశంలో కూడా జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం విశేషం. ఏదిఏమైనా నాటి పాపం.. నేడు ఇలా బీఆర్ఎస్ కు గట్టిగా తగిలిందని నెటిజన్స్ కామెంట్స్ రూపంలో హోరెత్తిస్తున్నారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు