తెలంగాణ బ్యూరోస్వేచ్ఛ: Heatwave alert: ఈ సంవత్సరం వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, సగటుతో పోలిస్తే కనీసంగా నాలుగు డిగ్రీలు (సెంటీగ్రేడ్) పెరగొచ్చని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో మార్చి సెకండ్ వీక్ నాటికే 40 డిగ్రీలు క్రాస్ అయింది.
ఈ నెల చివరి నాటికి పెరిగే అవకాశాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం తదితర 13 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీచేసింది.
కేంద్ర వాతావరణ శాఖ మాత్రం రానున్న రోజుల్లో వడగాడ్పులు వీస్తాయని, ఈ ప్రభావం పై జిల్లాలతో పాటు సిరిసిల్ల జిల్లాలోనూ గణనీయంగా ఉంటుందని పేర్కొన్నది. తెలంగాణవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో కనీస స్థాయిలో పగటి ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా ఉంటుందని, కొన్ని జిల్లాల్లో అది గరిష్టంగా 45 డిగ్రీలకు కూడా చేరుకోవచ్చని అంచనా వేసింది.
also read: Ganja Seized: హైదరాబాద్ లో ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ కావాల్సిందే!
ఆదిలాబాద్, హకీంపేట్, దుండిగల్, నిజామాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని రాడార్ స్టేషన్లలో సాధారణకంటే 3.1 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు ఢిల్లీలోని వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో పేర్కొన్నది. భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, హైదరాబాద్, మెదక్, రామగుండం, పటాన్‌చెరు, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఇది 1.6 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మధ్య ఎక్కువగా (సాధారణంతో పోలిస్తే) నమోదైనట్లు వివరించింది.
పగటి ఉష్ణోగ్రతల్లో మాత్రమేకాక రాత్రి టెంపరేచర్ సైతం సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సగటున ఒకటిన్నర డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు, నిజామాబాద్2లో 40.1 డిగ్రీలు నమోదు కాగా భద్రాచలం, హకీంపేట్, హన్మకొండ, దుండిగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో 38 డిగ్రీలకంటే ఎక్కువే ఉన్నట్లు వివరించింది.
also read: Heatwave Alert: మండిపోతున్న తెలంగాణ.. ఇవేమి ఎండలు బాబోయ్!
హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం… మార్చి 13వ తేదీకే సాధారణంతో పోలిస్తే సగటున 3.3 డిగ్రీల మేర పెరిగినందున ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల దాటిందని, రానున్న రెండు రోజుల్లో ఇది 42 డిగ్రీలు క్రాస్ అయ్యే అవకాశమున్నదని, మరికొన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైనే నమోదు కావొచ్చని పేర్కొన్నది.
ఉత్తర తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్లనే ప్రస్తుతం ఎల్లో వార్నింగ్ కొనసాగుతున్నదని, రెండు మూడు రోజుల్లో ఇది చాలా జిల్లాల్లో ఆరెంజ్ స్థాయికి చేరుకుంటుందని వివరించింది. ఈసారి హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ సాధారణంతో పోలిస్తే ఎక్కువగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.