YS Sharmila On Amaravati 2.0: అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) హాజరైన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. అమరావతి నిర్మాణానికి అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగం, అమరావతి సభపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తనదైన శైలిలో ఎక్స్ వేదికగా సైటెర్లు వేశారు.
ప్రధాని.. సున్నం కొట్టి వెళ్లారు
ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేని తేల్చి చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏంటి ? అని ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టి వెళ్ళారని విమర్శలు చేశారు.
పచ్చి అబద్దాలు
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు ప్రధాని తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని షర్మిల విమర్శించారు. మళ్లీ ‘అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం’ అంటూ బూటకపు మాటలు చెప్పారని మండిపడ్డారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదని సూటిగా ప్రశ్నించారు.
రాజధానికి చట్టబద్దత ఇచ్చారా?
అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా సభ వేదికగా ప్రకటించారా? అంటూ ప్రధాని మోదీని షర్మిల నిలదీశారు. రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? అంటూ ఫైర్ అయ్యారు. పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అటు సీఎం చంద్రబాబు సైతం ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల అన్నారు. ప్రధాని మోదీని నమ్మి.. మళ్లీ మళ్లీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలని సూచించారు.
Also Read: New Rule for Uber Ola Rapido: క్యాబ్ సేవల్లో కొత్త రూల్స్.. 25% డిస్కౌంట్లు.. డ్రైవరే డబ్బు ఇవ్వాలి!
చంద్రబాబుకు సూటి ప్రశ్నలు
కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం చంద్రబాబును సైతం పలు అంశాలపై షర్మిల సూటిగా ప్రశ్నించారు. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు అంటూ స్పష్టం చేశారు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న షర్మిల.. అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని పదే పదే చెప్పే చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారని ప్రశ్నించారు. ‘వడ్డీల భారం మోసేదెలా? వరల్డ్ బ్యాంక్, ADB, KFW, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు ?’ అంటూ నిలదీశారు. ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు? అంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాల మీద ఎందుకు అప్పు భారం మోపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.