న్యూఢిల్లీ, స్వేచ్ఛ: అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఉపశమనం దక్కింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై పిటిషనర్‌గా ఉన్న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సహేతుక కారణాలు చూపించలేకపోయారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జగన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని సుప్రీంకోర్ట్ పేర్కొంది. జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ కనిపించడం లేదని, రద్దు చేయాల్సిన అవసరం లేదని చేసింది.
బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరించుకుంటారా? లేదా డిస్మిస్ చేయాలా? అని రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. డిస్మిస్ చేయవద్దని, హైకోర్టుకు వెళ్లే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అందుకు అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసిన ధర్మాసనం ఉపసంహరించుకుంటారా? లేదా డిస్మిస్ చేయమంటారా? అని ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకు ద్విసభ్య ధర్మాసనం అంగీకరించింది.
మరోవైపు, ఈ కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను బెంచ్ తోసిపుచ్చింది. జగన్ కేసుల్లో శుక్రవారం మాత్రమే విచారణ జరుగుతోందంటూ సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. అయితే, ఇప్పటికే విచారణ కొనసాగుతున్నందున వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జగన్ కేసులపై రోజువారీ విచారణ జరగాలని, దీనిపై హైకోర్టు పర్యవేక్షణ చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణ ప్రస్తుత దశలో మరో రాష్ట్రానికి బదిలీ చేస్తే విచారణ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు పిటిషన్లపైనా జస్టిస్ నాగరత్నం ధర్మాసనం విచారణ చేపట్టింది.