Roja on CM Chandrababu: సీఎం చంద్రబాబుకు సంక్షేమం అమలు చేయడం చేతకాకపోతే కుర్చీ జగన్‌కు అప్పగించాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. “మీకు సంక్షేమం ఇవ్వడం చేతకాకపోతే కుర్చీ దిగండి. జగన్ అన్నకు కేటాయించండి. జగన్ అన్న సంక్షేమం ఎలా చేయాలో చూపిస్తారు” అని రోజా సవాల్ విసిరారు.
చంద్రబాబు పాలనలో కరువు
రోజా మాట్లాడుతూ, “ఏ రోజైతే చంద్రబాబు సీఎం అయ్యాడో, అప్పటి నుంచి రాష్ట్రంలో అన్యాయం మొదలైంది. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తప్పదు. ఈవీఎంలను మ్యానేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మాత్రం మ్యానేజ్ చేయలేకపోతున్నారు” అని విమర్శించారు. రైతులకు రైతు భరోసా, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం లేకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. “రైతులు ఆగమవుతుంటే ప్రభుత్వం మాత్రం ముందుకు వెళ్తోంది” అని ఆమె అన్నారు.
లోకేశ్ యాత్రపై వ్యంగ్యం..
నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రను “కామెడీ యాత్ర”గా అభివర్ణించిన రోజా, “ప్రతి చోట సెల్ఫీలు తీసుకుంటూ డ్రామా చేశారు. రెండు రోజులు యాత్ర, రెండు రోజులు డుమ్మా కొడుతూ ముందుకు సాగారు” అని విమర్శించారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు తీసుకుని ధరలు తగ్గిస్తామని చెప్పిన హామీలను గుర్తు చేసిన ఆమె, “ఇప్పుడు మళ్లీ పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకుని ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ఉందా?” అని ప్రశ్నించారు.
Also Read: ఆ నియోజకవర్గంలో ఇక పండుగే.. నారా లోకేష్ కీలక ప్రకటన
జగన్ పాలనలో మహిళలకు అండ..
గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు అండగా నిలిచారని, కానీ ఇప్పుడు మహిళలపై అన్యాయం జరుగుతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కిమ్స్ ఆసుపత్రిలో ఓ యువతి ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ, “ఆసుపత్రి ఏజీఎం దీపక్ టీడీపీ నాయకుడు కాబట్టి యువతి కుటుంబానికి కడుపు కోత విధించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే అనుమానం కలుగుతోంది” అని అన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కేసులను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. “ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. అలాగే, పాస్టర్ మృతి కేసులో రోజుకో సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు” అని విమర్శించారు.
విచ్చల విడిగా మద్యం, గంజాయి
రాష్ట్రంలో మహిళలపై దాడులకు మద్యం, బెల్ట్ షాపులే కారణమని రోజా ఆరోపించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే వేల కోట్ల అప్పులతో రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. కానీ ప్రజలకు ఒక్క పింఛన్ తప్ప ఏమీ చేయలేదని ఆమె అన్నారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వంపై 16 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని, దీనిని “పచ్చ చానళ్లు అబద్ధాలను అందంగా నూరిపోస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.
పవన్ నిద్రపోతున్నడా..?
తిరుపతిలో మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతోందని రోజా ఆరోపించారు. ఇప్పడు ఈ సనాతన యోదుడు ఎక్కడికి వెళ్లాడు? మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ ఉంటానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నారు? అని రోజా ప్రశ్నించారు.