Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన కీలక హామీని మంత్రి నారా లోకేష్ నెరవేర్చబోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుంచే ప్రజా దర్బార్ ద్వారా సమస్యలు పరిష్కరించడం, ఎన్నికల్లో నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా యువనేత కార్యాచరణ మొదలుపెట్టారు. ఇప్పటికే ఎన్నో సమస్యలను, మరెన్నో హామీలను నెరవేర్చిన లోకేష్.. రెండ్రోజుల్లో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యకు పరిష్కారం చూపించబోతున్నారు. గెలిచిన వెంటనే పేదలకు కొత్త బట్టలు ఇచ్చి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో మంగళగిరి ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నెరవేర్చకోబోతున్నారు. ఆ హామీ మేరకు నియోజకవర్గంలో 3వేల మంది పేదలకు రేపట్నుంచి (ఏప్రిల్ 3) 12వరకు ఇళ్ల పట్టాలు స్వయంగా లోకేష్ అందజేయనున్నారు. కాగా, తాము నివసిస్తున్న భూమిని, రెక్కల కష్టంతో నిర్మించుకున్న గూడును క్రమబద్దీకరించాలని మంగళగిరి ప్రజలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, ఎంతోమంది నాయకులు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఎన్నికల్లో లబ్ది పొందారే తప్ప హామీ నెరవేర్చలేదు. కానీ, లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కూడా కావడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చబోతున్నారు.
మన ఇల్లు – మన లోకేష్
ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచే కార్యాచరణ మొదలుపెట్టిన లోకేష్ గత 10 నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణకు వివిధ శాఖలతో సమన్వయంతో అధికారులే ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు నింపడం వరకూ అన్నీ స్వయంగా పర్యవేక్షించారు. వాస్తవానికి అవన్నీ అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూములు కావడంతో ఈ సమస్యను పరిష్కరించడం అంత సులువేం కాదని అందరూ అనుకున్నారు. కానీ, ఈ సమస్యను పట్టుదలగా తీసుకున్న మంత్రి పరిష్కారం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. తొలి దశలో 3వేల ఇళ్ల పట్టాల పంపిణికి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేయబోతున్నారు. మొత్తంగా నియోజకవర్గ 3వేలకు పైగా పట్టాల పంపిణికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 3న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో అందజేయనున్నారు. లోకేష్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసి ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇలా ఏప్రిల్ 12 వరకూ లబ్ధిదారులకు మంత్రి లోకేష్ పట్టాలు అందజేస్తారు.