Kodali Nani Heart Surgery: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండె ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో నానికి బైపాస్ సర్జరీ జరిగింది. గుండె సంబంధిత చికిత్స చేయడంలో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసింది. బుధవారం 8 గంటలపాటు శ్రమించిన పాండా బృందం సర్జరీని సక్సెస్ చేసింది. సర్జరీ విజయవంతమైందని ఈ మేరకు నాని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కొడాలి ఉన్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. కాగా, బుధవారం ఉదయం నుంచి నానికి సర్జరీ పూర్తయ్యే వరకూ ఆయన అభిమానులు, గుడివాడ వైసీపీ కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు చేశారు. దేవాలయంలో 101 కొబ్బరి కాయలు కొట్టి కొందరు, చర్చి, మసీదుల్లో మరికొందరు ప్రార్థనలు చేశారు. దేవుళ్లందరి దీవెనలు, ప్రజల ఆశీసులతో నానికి సర్జరీ సక్సెస్ కావాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నారు.
Also read: Nara Lokesh: ఆ నియోజకవర్గంలో ఇక పండుగే.. నారా లోకేష్ కీలక ప్రకటన
హైదరాబాద్ నుంచి ముంబైకు..
గత కొన్నిరోజులుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న నాని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే పరీక్షల్లో గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు రక్త నాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. అయితే సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్య పరిస్థితి సహకరించదని, చేసినా మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌కు వెళ్లాలని వైద్యులు సూచించారు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో నాని ముంబైకి తరలించారు. సోమ, మంగళవారాల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు చేసిన వైద్యులు బుధవారం సుప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డా. పాండా నేతృత్వంలో సర్జరీ విజయవంతంగా ముగిసింది. కాగా, అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేయగలరని పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లాలు ప్రసాద్ యాదవ్, రఘురామకృష్ణరాజు లాంటి ప్రముఖులకు రమాకాంతే శస్త్ర చికిత్స చేశారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/