Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగులు (Elephants) బీభత్సం సృష్టించాయి. గుండాల కోన దగ్గర భక్తులపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. మహా శివరాత్రి నేపథ్యంలో వై కోటకు చెందిన భక్తులు ఆలయానికి అటవీ మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు వంకాయల దినేష్, చంగల్ రాయుడు, తుపాకుల మణమ్మగా గుర్తించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చంద్రబాబు, పవన్ విచారం
ఏనుగుల దాడి వార్త తెలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu), అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసానిచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను స్పాట్‌కు వెళ్లాలని పవన్ ఆదేశించారు. వెంటనే ఆయన అసెంబ్లీ నుంచి అక్కడకు బయలుదేరి వెళ్లారు. ఘటనపై సమగ్ర నివేదిక కావాలని పవన్ అధికారులకు స్పష్టం చేశారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి పవన్ వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రంగంలోకి హోంమంత్రి అనిత
ఏనుగుల దాడి ఘటనతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం అటవీ మార్గాల్లో కాలినడకన వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లు పెంచాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. రాయలసీమ సహా అటవీ మార్గాల్లోని శివాలయాల దగ్గర కూడా భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ, అటవీ సిబ్బంది సమన్వయం చేసుకుని భక్తుల రక్షణ కోసం పని చేయాలన్నారు.
మన్యం జిల్లాలోనూ ఏనుగుల బీభత్సం
పార్వతీపురం మన్యం జిల్లా పెదమేరంగిలోనూ ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం గాయత్రి రైస్ మిల్ షట్టర్లను విరుగగొట్టి చొరబడ్డాయి. అక్కడ నిల్వ చేసిన ధాన్యం, బియ్యాన్ని చెల్లాచెదురు చేశాయి. నెల రోజుల వ్యవధిలో మిల్లుపై దాడి చేయడం ఇది రెండోసారి.
మంత్రివర్యా.. కుంకీ ఏనుగులు ఏవి?
రాష్ట్రంలో తరచూ ఏనుగులు దాడి చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెప్పించేందుకు ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి చర్చలు జరిపారు. ఇది జరిగి ఐదు నెలలకు పైనే అయింది. కానీ, ఇప్పటిదాకా అవి ఆంధ్రాలో అడుగుపెట్టలేదు. కర్ణాటక నుంచి మొత్తం 8 కుంకీ ఏనుగులను తెప్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటి రాకతో కడప, చిత్తూరు, అన్నమయ్య, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏనుగుల దాడులకు అడ్డుకట్ట పడుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ, వాటి రాక ఆలస్యం అవుతున్నది. తాజా దాడుల నేపథ్యంలో కుంకీ ఏనుగులపై చర్చ జరుగుతున్నది.
Read Also: Hardik Pandya: అందుకే హార్దిక్ భయ్యా.. నువ్వు కెప్టెన్ కాలేదు..!