Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంశం గత కొన్ని రోజులుగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి విచారణ ముమ్మరం చేసిన సిట్ అధికారులు.. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డిని సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ను సిట్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy On AP Liquor Scam) సంచలన ట్వీట్ చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
సంచలన ట్వీట్
మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్ కేసిరెడ్డి (Raj Kasireddy)ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న వేళ.. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy Sensational Tweet) ఆసక్తికర ట్విట్ పెట్టారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
జగన్ ను టార్గెట్ చేశారా?
లిక్కర్ స్కామ్ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కేసిరెడ్డేనని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ పాలనలో లిక్కర్ మీద వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి కేసిరెడ్డి అత్యంత సన్నిహితుడని పేరుంది. ఈ మెుత్తం లిక్కర్ కుంభకోణం వెనక వైసీపీ అధినేత జగన్ ఉన్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పెట్టిన ట్విట్ ఆసక్తికరంగా మారింది. దొంగల మిగతా బట్టలు పూర్తిగా విప్పడానికి సహకరిస్తా.. అంటూ ఆయన పరోక్షంగా జగన్ గురించే అన్నారా? అన్న చర్చ ఏపీలో రాజకీయల్లో మెుదలయ్యాయి.
Also Read: TG Inter Supplementary Exam: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా? వెంటనే ఇలా చేయండి!
3 గంటలపాటు విచారణ
ఇటీవల సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కామ్ కు ప్రధాన కారకుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని మీడియా ముఖంగా పదే పదే చెబుతూ వచ్చారు. కసిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా నడిచినట్లు చెప్పారు. ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. సిట్ విచారణకు పూర్తిగా సహరిస్తానని తేల్చి చెప్పారు. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో కసిరెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు.. అర్ధరాత్రి 11గం.ల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటివరకూ సేకరించిన ఆధారాలతో కసిరెడ్డికి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.