Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది. ఆఖరికి మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇరు వర్గాల తరఫున లాయర్ల వాదనలు విన్న కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ కేసులో వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ దక్కింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు వంశీపై మరో నాలుగు కేసులు ఉన్నాయి. మొత్తం ఐదు కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ దక్కింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం ఇంతవరకూ బెయిల్ రాలేదు. ప్రస్తుతం ఈ కేసులోనే వంశీ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వరుస కేసులు ఆయన్ను వెంటాడాయి.
వంశీపై ఉండే కేసులు ఇవే..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపైనే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేపట్టింది. పలుమార్లు ముందస్తు బెయిల్ కొట్టిసిన జిల్లా, హైకోర్టు ధర్మాసనాలు.. ఆఖరికి మంగళవారం బెయిల్ దక్కింది. రూ.50 వేలతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ వచ్చినా వంశీ విడుదల కష్టమే అయ్యింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసులో మే-21 వరకు కోర్టు రిమాండ్ విధించినది. 22న టీడీపీ కార్యాలయం దాడి కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే వల్లభనేని వంశీ విడుదల అవుతారు.. లేకుంటే రిలీజ్ కష్టమే.
ఇక రాజకీయ సన్యాసమే?
వాస్తవానికి.. మాస్ అంతకుమించి రెబల్ లీడర్‌గా ఉన్న వంశీ.. అరెస్ట్ తర్వాత పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే ఆ ఫొటోలు, వీడియోలను చూస్తే వంశీనేనా? అనే సందేహాలు అందరిలోనూ వస్తాయి. ఆరోగ్యం సహకరించకపోవడం, పదే పదే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బెయిల్ పైన బయటికొచ్చిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా వంశీ అత్యంత ఆత్మీయులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే చర్చ గన్నవరం, కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఏం మాట్లాడినా మళ్లీ ఏదో ఒక కేసు, హడావుడి అంతా ఎందుకు? అయినా వైసీపీలో ఉన్నా, ఒకవేళ పార్టీ మారినా ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నది వంశీ మనసులోని మాటని తెలిసింది. ఈ మధ్యనే ములాఖత్‌లో తన భార్య పంకజ శ్రీతో కూడా ‘రాజకీయ సన్యాసం’పై చర్చించినట్లుగా తెలుస్తున్నది. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ వ్యాపారాలు ఉన్నాయి. దీంతో వ్యాపారాలు మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత బయటికి రాగానే రాజకీయాలకు గుడ్ బై అనే ప్రకటన ఉంటుందని భోగట్టా. మరోవైపు వంశీ జైలుకెళ్లిన తర్వాత వైసీపీ అండగానే నిలిచింది. నేరుగా వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జైలుకెళ్లి పరామర్శించారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేదా వైసీపీలో కొనసాగుతారా? అనేది చూడాలి మరి.
Read Also- YS Jagan: ఫస్ట్ టైమ్ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ పొగడ్తలు..