Tragic Incidents in AP Temples: దేవుడి ఆగ్రహం ఈ రూపంలో కనిపిస్తుందా? నిన్న తిరుపతి, నేడు సింహాచలం క్షేత్రాలలో జరిగిన ఘటనలు చూస్తే కొందరు ఈ మాటను లేవనెత్తుతున్నారు. ఏదైనా శాంతి పూజలు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. రెండు ప్రమాదాలలో భక్తులు చనిపోవడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం పరిశీలించాలని పండితులు కోరుతున్నారు.
ఏపీలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో తిరుమల, సింహాచలం ప్రసిద్ధి గాంచినవి. ఈ అలయాలకు ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలి వస్తుంటారు. ఈ రెండు క్షేత్రాలు మహిమాన్వితమైన క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి కూడా భక్తులు ఈ అలయాలకు అను నిత్యం వస్తుంటారు.
ఇక తిరుమల క్షేత్రానికి అయితే నిత్యం దర్శనాల కోసం భక్తులు బారులు తీరుతూ ఉంటారు. ఇక్కడ టీటీడీ అధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంటారు. టీటీడీ ఛైర్మన్ గా బిఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన సమయం నుండి టీటీడీ సేవలు మరింత విస్తృతం చేశారు. ఏ మహోత్సవం జరిగినా ఛైర్మన్ దగ్గరుండి మరీ పర్యవేక్షించడం విశేషం.
ఆ ఘటన దురదృష్టకరం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ దశలో సర్వదర్శనం టోకెన్లు జారీలో జనవరి 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట ఓ దురదృష్టకర ఘటనగా చెప్పవచ్చు. పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు.
అలాగే ఇద్దరు తీవ్ర గాయాల పాలు కాగా, మరో 31 మంది స్వల్ప గాయాల పాలయ్యారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు రూ 25 లక్షల, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ. 2 లక్షల పరిహారం టీటీడీ అందజేసింది.
అసలు అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ ఘటన జరగడంతో టీటీడీతో పాటు ప్రభుత్వం నివ్వెర పోయింది. సీఎం చంద్రబాబు హుటాహుటిన తిరుమలకు చేరుకొని సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నుండి భక్తులకు సేవ అందించడంలో టీటీడీ మరింత అప్రమత్తమైంది. కాగా ఘటనకు సంబంధించి భాద్యులను గుర్తించి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది.
ఈ ఘటన దారుణం..
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సంధర్భంగా జరిగిన ఘటనను కళ్ళారా చూసిన భక్తులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. చందనోత్సవం సంధర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంధర్భంగా ఆలయం వద్ద పెద్ద క్యూ ఏర్పడింది.
సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ లోని కొందరు భక్తులు రాత్రి సమయం కావడంతో కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత భీకర గాలులు మొదలయ్యాయి. పాపం.. ఎలా నిద్ర పోయారో అలాగే కన్నుమూశారు 7 మంది భక్తులు.
గాలులకు గోడ కూలడంతో ముగ్గురు మహిళా భక్తులు, నలుగురు పురుష భక్తులు కన్ను మూశారు. గోడ కూలిన విషయం కూడా తెలియని స్థితిలో ఆ భక్తులు కన్ను మూశారని చెప్పవచ్చు. ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశాయి. హోమ్ మంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
తప్పెవరిది?
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సంధర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన, సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సంధర్భంగా జరిగిన ఘటనలో మొత్తం 13 మంది భక్తులు తుదిశ్వాస విడిచారు. తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించి అయితే అక్కడ అధికారుల తప్పిదం కనిపించిందన్నది పెద్ద విమర్శగా వినిపిస్తోంది.
అక్కడ విధుల్లో గల కొందరు అధికారులు తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో ఒక్కసారిగా భక్తులు రావడంతో దైవదర్శనానికి వచ్చిన ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఇక సింహాచలం ఘటనలో అయితే అధికారులు ముందుగా ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేదన్నది పెద్ద ప్రశ్న. ఓ వైపు ఈదురు గాలులు, వర్షం ధాటికి గోడలు కూలే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తారు.
కానీ ఇక్కడ భక్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం ఉందన్నది వినిపిస్తున్న విమర్శ. వీఐపి సేవలో తరిస్తూ, సామాన్య భక్తులను పట్టించుకోలేదని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఘటనలో 7 మంది భక్తులు ప్రాణాలు వదిలారు.
ఈ రెండు ఘటనలు ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జరగడం విశేషం. ఎవరి నిర్లక్ష్యమన్న విషయం అలా ప్రక్కన పెడితే ప్రాణాలు పోయింది మాత్రం భక్తులవి. దేవాదాయ శాఖ ఈ రెండు ఘటనలు దృష్టిలో ఉంచుకొని మళ్లీ పునరావృతం కాకుండా భాద్యులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నది భక్తుల అభిప్రాయం.
Also Read: Simhachalam Temple: గోడ కూలి 7 మంది భక్తులు మృతి.. అప్పన్న సన్నిధిలో అపశృతి
ఓ భగవంతుడా నీవే దిక్కు అంటూ వచ్చిన భక్తుల ప్రాణాలకు రక్షణ లేకపోతే ఎలా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే శాంతి పూజలు చేయాలని అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవని మరికొందరు పండితుల వాదన. ఏదిఏమైనా ప్రభుత్వం కాస్త సీరియస్ యాక్షన్ లోకి దిగాల్సిందే.. లేకుంటే ఇలాంటి అపవాదును భరించక తప్పదు మరి.