MLC Nagababu: పిఠాపురంలో టిడిపి వర్సెస్ జనసేన నినాదాలు మార్మోగాయి. ఎమ్మెల్సీ హోదాలో తొలిసారిగా నాగబాబు పిఠాపురం వచ్చిన సంధర్భంగా జనసేన నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఓ వైపు జై వర్మ, జై తెలుగుదేశం అంటూ తెలుగు తమ్ముళ్ల నినాదాలు, మరోవైపు పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా, జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు హోరెత్తాయి.
పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు నాగబాబు శుక్రవారం వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పూర్తయిన పనులను ప్రారంభించారు.
అందులో భాగంగా రూ. 28.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలసి ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో రూ. 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంప్ హౌస్ లో మోటార్ల పని తీరుని పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ ని ప్రారంభించారు.
క్యాంటిన్లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని నాగబాబు వడ్డించారు. నాగబాబుతో పాటు ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
నాగబాబుకు జనసేన శ్రేణుల ఘనస్వాగతం
శాసన మండలి సభ్యులుగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన నాగబాబుకు నియోజకవర్గ పార్టీ శ్రేణులు, ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. పిఠాపురం, గొల్లప్రోలు మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా బాణసంచా పేలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ, జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు.
Also Read: YS Sharmila on YS Jagan: తల్లిని మోసం చేశారు.. చిల్లిగవ్వ ఇవ్వలేదు.. జగన్ పై షర్మిల ఫైర్..
వర్మ దూరం..
నాగబాబు పాల్గొన్న అభివృద్ది కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొనకపోవడం విశేషం. ఇటీవల నాగబాబు చేసిన కామెంట్స్ ప్రభావంతో వర్మ కాస్త ఆగ్రహంతో ఉన్నారని చెప్పవచ్చు. దీనితో పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి క్యాడర్ మధ్య కాస్త విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రాగానే, రోడ్డుపై నినాదాలతో టిడిపి, జనసేన కార్యకర్తలు.. బల ప్రదర్శన చేశారని చెప్పవచ్చు. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పోలీసులు ముందస్తు చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వర్మకు పిలుపు ఉందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవల వర్మ వైసీపీలో చేరనున్నారన్న వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వర్మ అభివృద్ది కార్యక్రమాల్లో కనిపించపోవడం విశేషంగా చెప్పవచ్చు.