YS Sharmila on YS Jagan: మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించడంలో కాస్త వెనకడుగు వేసినట్లు షర్మిల కనిపించినా, మరో మారు తనదైన శైలిలో ఆస్తుల వ్యవహారాన్ని లేవనెత్తి జగన్ ను ఆమె దుయ్యబట్టారు.
వైయస్సార్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై వైయస్ జగన్, వైయస్ షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఈ విభేదాలను సరిదిద్దేందుకు వైయస్ విజయమ్మ సైతం ప్రయత్నించిన దాఖలాలు గతంలో కనిపించాయి. ఆత్ర వ్యవహారం వైఎస్ కుటుంబ వ్యక్తిగత విషయమైనప్పటికీ, జగన్ తో పాటు షర్మిల కూడా ప్రకటనల ద్వారా ఆస్తుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇదే విషయంపై పలుమార్లు షర్మిల మీడియా సమావేశాలు నిర్వహించి, కన్నీటి పర్యంతం అయ్యారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం మీడియా సమావేశాల ద్వారా షర్మిలపై విమర్శలు గుప్పించినా, ఆ తర్వాత సైలెంట్ అయ్యారని చెప్పవచ్చు.
తాజాగా వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేయడం ఏపీలో ప్రస్తుతం సెన్సేషనల్ టాపిక్ గా మారింది. షర్మిల మాట్లాడుతూ.. తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడి మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని సంచలన కామెంట్ చేయడం విశేషం. సరస్వతీ పవర్ షేర్ ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకం పెట్టారని, అయినా ఇప్పటివరకు తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదన్నారు. విజయమ్మకు సరస్వతీ పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ ఇచ్చారని, మళ్లీ తనకే కావాలని జగన్ కోర్టుకు వెళ్లారన్నారు. జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఆలోచించాలని షర్మిల కోరారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 45.7 మీటర్ల ఎత్తును నిర్మించాలని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి అతి ముఖ్యమైనదని, హోదా ఎంత ముఖ్యమో పోలవరం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ షర్మిల ప్రశ్నించారు. వైయస్సార్ హయాంలో 33 శాతం పనులు పూర్తయ్యాయని, జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం పోలవరం పనులు మూడు శాతం దాట లేదంటూ షర్మిల విమర్శించారు. బిజెపికి జగన్ బాబు ఇద్దరూ లొంగిపోయారని, ఇప్పటికైనా రైతన్నల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోలవరం ఎత్తును పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఇటీవల వైయస్ వివేక హత్య కేసు కు సంబంధించి షర్మిల చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. ఒకరిపై అసూయ ద్వేషంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసేవారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలంటూ షర్మిలను ఉద్దేశించి రోజా ట్వీట్ చేయడం విశేషం.