Tadipatri: తాడిపత్రి.. ఈ నియోజకవర్గం రాయలసీమలో (Rayalaseema) ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా సరే.. ప్రత్యర్థుల మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు..! రేపొద్దున్న ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చిన నాడు అంతకుమించి కథా కహానీ నడుస్తుంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) .. జేసీ కుటుంబాన్ని (JC Family) ఎలా బంతాట ఆడుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడేమో వైసీపీ ఓడిపోవడం.. అందులోనూ కేతిరెడ్డి ఎమ్మెల్యేగా పరాజయం పాలవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా.. జేసీ అస్మిత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో వాళ్లు చెప్పిందే వేదం.. ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇలా జేసీ వర్సెస్ కేతిరెడ్డి కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వైరం నడుస్తూనే ఉన్నది. ఈ ఇద్దరి మధ్యలో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు బలవ్వడం కామన్ అయిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పట్నుంచీ ఇప్పటి వరకూ కేతిరెడ్డిపైనకి ఒంటికాలితో లేస్తున్నారు జేసీ. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని జిల్లా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే ఏడాదిగా కనీసం కార్యకర్తలతో కలిసి మాట్లాడటానికి.. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా కేతిరెడ్డి పరిస్థితి లేకపోవడం గమనార్హం. దీంతో తాడిపత్రిలో అసలేం జరుగుతోంది..? ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
హైకోర్టు ఆదేశాలు పట్టించుకోరా?
పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని జిల్లా ఎస్పీ జగదీష్‌ను వైసీపీ నేతలు పదే పదే కోరుతున్న పరిస్థితి. సోమవారం నాడు కూడా మరోసారి ఎస్పీని కలిసి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రి పరిస్థితులను వివరించారు. ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలని, తగిన భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలలైనా హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం దారుణమని, ఎస్పీ జగదీష్ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎస్పీతో భేటీ అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని.. పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలని కోరారు. తాడిపత్రిలో నియంత పాలన జరుగుతోందని.. మాజీ ఎమ్మెల్యేపై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.
Read Also- Watch Video: ఇదేం వింతరా బాబూ.. చెట్లు మూత్రం పోస్తున్నాయ్.. వీడియో వైరల్!
ఇంకెన్నాళ్లు ఇలా..?
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు. పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చేవారిని రప్పా రప్పా నరుకుతానని జేసీ బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడం దారుణమన్నారు. తాడిపత్రిలో హింసా రాజకీయాలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని పోలీసులు, ప్రభుత్వాన్ని మాధవ్ ప్రశ్నించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులను పోలీసులు పట్టించుకోరా? అని మండిపడ్డారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఇంటికి వెళితే పోలీసులకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందేనని మాధవ్ డిమాండ్ చేశారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో తాడిపత్రిలో నిరంకుశ పాలన జరుగుతోందని మండిపడ్డారు. పెద్దారెడ్డిని వెంటనే తాడిపత్రిలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. పెద్దారెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య ఎట్టి పరిస్థితుల్లో రాదని, జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతల దౌర్జన్యాలు దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. పెద్దారెడ్డి కి జరుగుతున్న అన్యాయంపై తప్పకుండా ఉద్యమిస్తామని విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు.
రప్పా.. రప్పా..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో షురూ అయిన రప్పా.. రప్పా డైలాగ్ తాడిపత్రికి పాకింది. పెద్దారెడ్డి వెంట తిరుగుతున్న వైసీపీ కార్యకర్తలు, నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ నాకు వైసీపీ శత్రువు కాదు. మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే. అతడి వెంట ఎవరు వెళ్లిన వారి భరతం పడతాను. గత ప్రభుత్వంలో మాపై అనేక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎప్పుడు అడుగు పెట్టిన రానివ్వకుండా అడ్డుకుంటాను. వైసీపీలో పెద్దారెడ్డి చిన్న లీడర్ మాత్రమే. కానీ, నేను పెద్ద లీడర్ అని ప్రజల్లో అబద్ధాలు చెప్పుకుంటారు. త్వరలోనే మా కార్యకర్తలు జేసీబీలతో మీ ఇంటిని కూల్చివేస్తారు. నువ్వు తాడిపత్రి పట్టణానికి ఎప్పుడు వచ్చినా మా కార్యకర్తలు నిన్ను రప్పా రప్పా చేస్తామంటున్నారు. తాడిపత్రి పట్టణానికి నువ్వు దొంగతనంగా వచ్చావు తప్పా.. దొరతనంగా ఎప్పుడు రాలేదు. 4 రోజులు నేను ఊరిలో లేకుండా వెళ్తున్నాను. మా టీడీపీ కార్యకర్తలు మీ ఇంటిని రప్పా రప్పా చేస్తారు. మేము వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదు. కానీ, రేపటి నుంచి పెద్దారెడ్డి ఇంటి దగ్గర వైసీపీ కార్యకర్తల ఇంటి ముందు మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
Read Also- KTR: హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ సూటి ప్రశ్నలు.. బదులిచ్చేదెవరు?