Tirupati: పండుగలు, పుణ్యక్షేత్ర యాత్రల సీజన్‌లో భారీగా పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ రైల్వే అధికారులు రామేశ్వరం-తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఈ రైళ్లు డిసెంబర్ 2 నుంచి 9 వరకు రామేశ్వరం నుంచి తిరుపతి వైపు, డిసెంబర్ 3 నుంచి 10 వరకు తిరుపతి నుంచి రామేశ్వరం వైపు నడుస్తాయి.
రైలు వివరాలు
రైలు నం. 06080 (రామేశ్వరం – తిరుపతి)
బయలుదేరే సమయం: సాయంత్రం 4:30 గంటలు
తిరుపతి చేరే సమయం: మరుసటి రోజు ఉదయం 10:10 గంటలు
రైలు నం. 06079 (తిరుపతి – రామేశ్వరం)
బయలుదేరే సమయం: మధ్యాహ్నం 11:55 గంటలు
రామేశ్వరం చేరే సమయం: మరుసటి రోజు తెల్లవారుజామున 4:45 గంటలు
ఎక్కువ సామర్థ్యం.. మరింత సౌకర్యం
రెండు రైళ్లకు 18 కోచ్‌లు జత చేశారు. సాధారణ రైళ్ల కంటే ఎక్కువ సీట్లతో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన యాత్ర అందించడమే లక్ష్యం. కుటుంబాలు, సమూహ యాత్రికులు, ఒంటరి ప్రయాణికులు సైతం సౌకర్యంగా ప్రయాణించేలా ఈ ఏర్పాటు చేశారు.
మార్గమధ్యంలో ఆగే స్టేషన్లు ఇవే..
మండపం, రామనాథపురం, పరమకుడి, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచ్చి, తంజావూరు, పాపనాసం, కుంభకోణం, మయిలాడుతురై, సీర్కాళి, చిదంబరం, కడలూరు పోర్ట్, విలుప్పురం, తిరువణ్ణామలై, ఆరణి రోడ్, వేలూరు కంటోన్మెంట్, కాట్పాడి, పాకాల స్టేషన్ల వద్ద ఈ రైళ్లు ఆగుతాయి.
టికెట్ల రిజర్వేషన్.. ముందస్తు బుకింగ్ తప్పనిసరి
పండుగలు, యాత్రల సీజన్ కావడంతో ఈ ప్రత్యేక రైళ్లు త్వరగానే నిండిపోతాయని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని, గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.దక్షిణ రైల్వే ఈ చొరవతో వేలాది మంది భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించనుంది. రామేశ్వరం, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపశమనం కలిగించనున్నాయి.
