MLA Naseer: గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (Mohammed Naseer Ahmed)కు సంబంధించిన ఓ వీడియో కాల్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 3, 2025న బయటకొచ్చిన ఈ వీడియోలో ఎమ్మెల్యే నసీర్.. వాణి అనే మాజీ టీడీపీ కార్పొరేటర్ తో కనిపించారు. ఆమెకు రొమాంటిక్ సైగలు చేస్తూ అసభ్యకరంగా వ్యవహించారు. ఆడియో స్పష్టంగా లేనప్పటికీ ఎమ్మెల్యే సైగలు అసభ్యకరంగా ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదం నేపథ్యంలో తాజాగా మరో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో మరోమారు ఎమ్మెల్యే నసీర్ అంశం తెరపైకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు ఈస్ట్ లోని నసీర్ అహ్మద్ కార్యాలయం ఎదుట ఆగస్టు 15న సోఫియా అనే మహిళా టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే గతంలో ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం మరోమారు తెరపైకి వచ్చింది. అందులో చెప్పినట్లుగా సోఫియా ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఇటీవల వైరల్ అయిన నసీర్ – వాణీల వీడియో కాల్ నిజమేనని సెల్ఫీ వీడియోలో సోఫియా స్పష్టం చేశారు. అయితే తాను ఆ వీడియోను లీక్ చేయలేదని పేర్కొన్నారు. వాణి భర్త నవీన్ కృష్ణ ఆ వీడియోను లీక్ చేశారని ఆమె ఆరోపించారు. నవీన్ కు వాణిపై ఎప్పటి నుండో అనుమానాలు ఉన్నాయని ఆయనే వీడియోను బయటపెట్టారని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యే, నవీన్, వాణి ఒక్కటయ్యారని.. వీడియో లీక్ చేశావంటూ తనను ఆరోపిస్తున్నారని సోఫియా ఆవేదన వ్యక్తం చేశారు.
‘సీఎం కాపాడాలి’
తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని సోఫియా తన సెల్ఫీ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశారు. తన పిల్లలను సైతం విచారణకు పిలిచారని పేర్కొన్నారు. తనకు ఏ పాపం తెలియదంటూ సెల్ఫీ వీడియోలో చెప్పినట్లుగా ఆమె ఆగస్టు 15న ఎమ్మెల్యీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే నసీర్, నవీన్, వాణిల నుంచి తనకు ముప్పు ఉందని.. సీఎం చంద్రబాబు తనను కాపాడాలని ప్రస్తుతం సోఫియా కోరుకుంటోంది.
ఎమ్మెల్యేపై మహిళా సంఘాలు ఫైర్
అంతకుముందు నసీర్ – వాణి వీడియో బయటకు రావడంతో టీడీపీ ఎమ్మెల్యేపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి ప్రవర్తన అసభ్యకరమని.. నసీర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మరోవైపు విపక్ష వైసీపీ సైతం టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటోదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియో డీప్ ఫేక్ ద్వారా తయారు చేశారని.. ఇది విపక్ష వైసీపీ కుట్ర అని టీడీపీ వాదిస్తోంది.
Also Read: Centre on GST: దీపావళి బొనాంజా ఫిక్స్.. ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు.. భారీగా తగ్గనున్న ధరలు!
రంగంలోకి పోలీసులు
నసీర్ – వాణికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి దాని వాస్తవికతను నిర్ధారించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సోఫియాను సైతం పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలోనూ ఓ టీడీపీ ఎమ్మెల్యే మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలు రాజకీయాంగా టీడీపీకి అడ్డంకిగా మారాయి.