Attack On TDP Office: కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తోందని, మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదని, రేపు వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చాక ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది? అంటూ చంద్రబాబు సర్కార్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో శుక్రవారం గుంటూరు సీఐడీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారన్నారు. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని, గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పట్టాభి రామ్‌లాగా ఎవ్వరూ బూతులు మాట్లాడరని, టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల మండిపడ్డారు.
నాకేం సంబంధం..?
‘ దాడులకు మా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వ్యతిరేకం. ఏదైనా మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. టీడీపీ ఆఫీసుపై దాడి సమయంలో నేను ఉప ఎన్నికల హడావుడిలో ఉన్నాను. కానీ, దాడులను సమర్థించటం లేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే టీడీపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతలు, కార్యకర్తల వరకూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్ని విషయాల్లో మా వాళ్లు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు నమోదు చేయలేదు. కూటమి నేతలు, కార్యకర్తలు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నది. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు’ అని పోలీసులు, ప్రభుత్వంపైన సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇంకెన్నాళ్లు ఇలా?
‘ కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది? మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని కృష్ణమురళీ ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలట్లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించాలి. మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలా కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా ముమ్మాటికి తప్పుడు కేసే. ఏడాది దాటింది. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సజ్జల హెచ్చరించారు.
అసలేం జరిగింది?
వైసీపీ హయాంలో 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వందల సంఖ్యలో వాహనాల్లో వెళ్లిన వైసీపీ నేతలు, కార్యకర్తలు.. కార్యాలయం పడి విధ్వంసం సృష్టించారు. అయితే దాడి చేస్తారనే సమాచారం ఇచ్చినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు కేసులు పెట్టినా సరే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తూతూమంత్రంగా కేసు నమోదుచేసిన పోలీసులు పట్టించుకోకుండా పక్కన పడేశారు. మరోవైపు టీడీపీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టడం గమనార్హం. అలా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ ఈ కేసును తొక్కిపట్టినా, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది చంద్రబాబు సర్కార్.
అన్నీ ఆయనే..!
కాగా, జగన్ ప్రభుత్వంలో ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని సీఐడీ తేల్చింది. అంతేకాదు ఈ దాడి వెనుక కర్త, ఖర్మ, క్రియ అంతా సజ్జల రామకృష్ణారెడ్డేనని కూడా సీఐడీ అధికారులు తేల్చారు. అంతేకాదు గతంలో అరెస్ట్ అయిన, విచారణకు హాజరైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో సజ్జలను ఏ-120గా చేర్చడం జరిగింది. ఈ కేసు నిందితుల్లో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్‌కు సీఐడీ నుంచి పిలుపు వచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని సజ్జల, అవినాశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేయగా, విచారణకు వస్తామని అధికారులు సమాచారం అందించారు. ఇవాళ సీఐడీ కార్యాలయం వద్దకు వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా వచ్చారు. కాగా, కోర్టు రోడ్డు వద్దే సజ్జల రామకృష్ణారెడ్డి కారును పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ్నుంచి సీఐడీ కార్యాలయం వరకూ ఆయన నడుచుకుంటూనే వెళ్లారు. అయితే విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Read Also-Amaravati: వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తే అమరావతి పరిస్థితేంటి? ఉంటుందా?