Rahul Gandhi- AP: ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోయాలని ప్రయత్నిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మంగళవారం (జనవరి 27) ఢిల్లీలో పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిశారు. వ్యూహాత్మక అడుగులు వేస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆమె (Rahul Gandhi- AP) ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యమంలో పాల్గొనాలంటూ పార్టీ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నాయకుడిని (Rahul Gandhi) ఆమె ఆహ్వానించారు.
ఈ మేరకు ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో రాహుల్ గాంధీతో షర్మిల మంగళవారం మాట్లాడారు. తమ ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తానని చెప్పారంటూ ఎక్స్ వేదికగా షర్మిల వెల్లడించారు. నరేగా (MGNREGA) పరిరక్షణ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 2 నాటికి నరేగా పథకాన్ని ప్రారంభించి 20 ఏళ్లు అవుతుందని, ఈ సందర్భంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉపాథి హామీ పథకాన్ని అమలు చేశారని షర్మిల గుర్తుచేశారు. అందుకే, అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచే ఉద్యమం చేపట్టేలా కార్యాచరణను సిద్ధం చేస్తామని వివరించారు.
Read Also- Telangana Sand Revenue: కాసులు కురిపిస్తున్న ఇసుక.. 9 నెలల్లో తెలంగాణ ఆదాయం ఎంతో తెలుసా?
షర్మిల మార్క్ పాలిటిక్స్!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ షర్మిల చురుగానే ఉంటున్నారు. దాదాపు అన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. కానీ, రాష్ట్రంలో పార్టీకి అంతగా బలం లేకపోవడంతో ఆమె అంతగా హైలెట్ కాలేకపోతున్నారు. విపక్ష వైసీపీ కంటే ముందుగా స్పందిస్తున్న సందర్భంగా కూడా ఉంటున్నాయి. అంతగా జనాల్లోకి వెళ్లడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆమె భావిస్తున్నప్పటికీ.. ఆశించిన విధంగా అడుగులు పడడం లేదు. దీంతో, పార్టీ జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దించి రాజకీయాలు చేయాలని షర్మిల భావిస్తున్నట్టుగా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించి, ఏపీకి వస్తాననడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also- Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదల ఇప్పట్లో లేనట్టే.. వ్యవహారం మళ్లీ మొదటికి!
బండ్లపల్లి సెంటిమెంట్
రాహుల్ గాంధీ పర్యటనకు అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిని షర్మిల వేదికగా ఎంచుకోవడం వెనుక రాజకీయ, భావోద్వేగ కారణాలు ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట, నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ ఇదే బండ్లపల్లి గ్రామం నుంచి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) ప్రారంభించారు. ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేయాలని ఆమె భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మరి, ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీల మధ్య వాడీవేడిగా రాజకీయం కొనసాగుతున్న వేళ, షర్మిల వ్యూహం… కాంగ్రెస్ ఉనికిని చాటిచెప్పగలదా?, రాహుల్ గాంధీ పర్యటన ఏపీ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపుతుందా?, వైఎస్సార్ సెంటిమెంట్‌ను షర్మిల ఎంతవరకు ఆకట్టుకోగలరు? అనేది వేచి చూడాలి!.

