Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కీలక సూత్రదారులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు (Prabhakar Rao), డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) తదితరులను వరుసగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగుచూసింది. వైఎస్ షర్మిల (YS Sharmila Phone Tapping) ఫోన్ ను సైతం నిందితులు ట్యాప్ చేసినట్లు తాజాగా బయటపడింది.
అన్నకు సమాచారం చేరవేత!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఏపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఫోన్ ను సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా బయటపడింది. అత్యంత గోప్యంగా షర్మిల మెుబైల్స్ ను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ ను రికార్డ్ చేయించినట్లు సమాచారం. ఆమె ఎవరెవరితో మాట్లాడుతోందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు షర్మిల అన్నకు చేరవేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా నిఘా పెట్టారని.. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించి తెలంగాణ పోలీసు అధికారి ద్వారా వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. తన మెుబైల్స్ ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించినట్లు సమాచారం. ఫోన్ల ట్యాపింగ్ విషయంలో ఆమె వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నతో షర్మిలకు విభేదాలు!
వైఎస్ జగన్ (YS Jagan), షర్మిల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో జగన్ తనను మోసం చేశారని షర్మిల బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు అప్పట్లో తెలంగాణలో పార్టీ (YSRTP) స్థాపించిన సమయంలో అడ్డంకులు సృష్టించారని కూడా పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాలకు స్వస్థి చెప్పిన షర్మిల.. ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ ను పదే పదే టార్గెట్ చేస్తూ ఆయన ఓటమికి ఆమె కూడా ఓ కారణమయ్యారు. జగన్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా షర్మిల అతనిపై విరుచుకుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి షర్మిల పేరు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమె ఏ విధంగా స్పందిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Kuppam Incident: సీఎం ఇలాకాలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు
చంద్రబాబు సన్నిహితుల ఫోన్ ట్యాప్?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందని నిన్న, మెున్నటి వరకూ అంతా భావించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress), బీజేపీ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలతో పాటు అప్పట్లో ఏపీకి చెందిన కీలకమైన వ్యక్తుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh) కు అత్యంత సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయిన లిస్ట్ లో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయా ఫోన్లను ప్రభాకర్ ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక చిప్ లో ఆ ఫోన్ ట్యాప్ సమాచారాన్ని భద్రపరచగా.. దానిని అప్పటి సీఎం జగన్ సన్నిహితులు వచ్చి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మెుత్తం మీద ఏపీకి సైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాకినట్లు వార్తలు వస్తుండటం.. తెలుగు రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.