స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్:Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా? లోకల్ ఇక చాలు, నేషనల్ లెవల్‌లో ఓ వెలుగు వెలగాలని సేనాని మనసులో ఉందా? వీలైతే పార్టీని తెలుగు రాష్ట్రాల నుంచి దేశం మొత్తం విస్తరించాలని ఉందా? తాను జాతీయ నేతగా ఎదుగుతారా? లేదా పార్టీతో పాటు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారా? ఈ విషయం తన ప్రసంగంతో పాటు తన ఆప్తుడు నాదెండ్ల లీక్ చేసేశారా? అంటే ఇదే అక్షరాలా నిజమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన సుదీర్ఘ ప్రసంగంను కాస్త పరిశీలిస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో పెద్ద ఎత్తునే లోకల్ టూ నేషనల్ వ్యవహారంపై చర్చ సాగుతోంది.
ఇదే ప్రత్యక్ష సాక్ష్యం..
ఆవిర్భావ సభలో తన పార్టీ, తన గురించి చాలా తక్కువగా మాట్లాడిన పవన్ దేశ రాజకీయాల గురించే ప్రస్తావన తెచ్చారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసాలు అంటూ పెద్ద చర్చే జరుగుతున్న సమయంలో దీనిపై కుండ బద్ధలు కొడుతూ మాట్లాడేశారు. దీంతో పాటు త్రిభాషా విధానంపై తమిళనాట యుద్ధ వాతావరణమే నెలకొంది. సీఎం స్టాలిన్ వర్సెస్ కేంద్రంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపైనా చాలా స్పష్టమైన వైఖరిని సభావేదికగా తేల్చి చెప్పేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, గోద్రా మారణహోమంపై చాలా లాజిక్‌గా మాట్లాడారు. మరోవైపు మహారాష్ట్ర, హరియాణాలో ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందన్న విషయాన్ని గుర్తు చేసుకొని మరీ చెప్పారు.
తమిళనాడులో దేవాలయాల సందర్శనకు వెళ్లినప్పుడు ఎంతో ఆదరించారని కూడా వెల్లడించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ భారతదేశానికి ఉపయోగపడేలా ఎదగాలని ఆప్తుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా ఆయనతో ఇలా లీకులు వదిలారని చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే వేర్వేరు భాషల్లో సైతం మాట్లాడటం గమనార్హం. దీంతో సేనాని ఎంత క్లారిటీతో ఉన్నారో? జాతీయ రాజకీయాలపై ఎంత ఉత్సాహంతో ఉన్నారనేది ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పుకోవచ్చు.
నమ్మకం.. ఉత్సాహం.. ప్రోత్సాహం..
పవన్ ప్రాంతీయం కంటే జాతీయ భావాలతో ఉన్నారనే విషయాన్ని 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత సమయం, సందర్భాన్ని బట్టి స్పష్టంగా చూపుతూ వస్తున్నారు. సనాతన ధర్మం, జాతీయ స్థాయిలోని సమస్యల ప్రస్తావన తేవడం ఇలాంటివి చేస్తూ వస్తున్నారు. బీజేపీకి అత్యంత నమ్మకస్తుడిగా, మిత్రుడిగా ఉంటూ వస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ప్రచారానికి పిలిపించి ఎంకరేజ్ చేయడంతో ఢిల్లీ పెద్దల ప్రోత్సాహం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి బీజేపీకి సౌత్ ఫేస్‌తో పాటు గ్లామర్ టచ్ ఇచ్చే వ్యక్తి వన్ అండ్ ఓన్లీ పవన్ అని కమలనాథులు భావిస్తున్నారు.
Also Read: Social Media: ఏపీ దారిలో తెలంగాణ.. ఇక అలా చేస్తే కటకటాలే
ఉత్తరాదిన ఇలాంటి వాళ్లు బీజేపీకి దొరకలేదు. సరిగ్గా ఇదే సమయంలో సేనాని ఒక సువర్ణావకాశంగా దొరికారు. సమస్యను బట్టి ఎంతటి పెద్ద రాజకీయ నేతకైనా, ముఖ్యమంత్రులకైనా సరే గట్టిగానే కౌంటర్లు ఇచ్చిపడేస్తున్నారు. త్రిభాషా విధానం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కుంభమేళా విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఏ రేంజిలో సేనాని విమర్శించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అటు బీజేపీ పెద్దల ప్రోత్సాహం, ఇటు పవన్ ఉత్సాహం ఇవన్నీ జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర ఏమిటి? అనేది మెల్లమెల్లగానే చెబుతూ వస్తున్నారు. దీంతో పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఎంతో దూరం లేదని, తొలి అడుగు ఆవిర్భావ సభతో మొదలైందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రాలో అన్న.. ఢిల్లీలో తమ్ముడు.. రాజ్యసభకూ!
వాస్తవానికి మెగా బ్రదర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర స్థాయిలో కీలకంగా మార్చే ప్రక్రియలో భాగంగానే మంత్రిని చేయబోతున్నారనే చర్చ జనసేనలో, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తునే జరుగుతోంది. వాస్తవానికి సోదరుడిని రాజ్యసభకు పంపాలని, ఆయన కూడా ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పటికీ ఏపీతో పాటు తెలంగాణలో బలోపేతానికి సన్నాహాలే చేస్తున్నారట. అందుకే అన్నను ఆంధ్రాకు పరిమితం చేసి.. తాను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట.
ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో నాగబాబుకు ఎమ్మెల్సీ కన్ఫామ్ కావడం, త్వరలోనే మంత్రి పదవి కూడా దక్కనుండటంతో ఇక లైన్ క్లియర్ అయ్యిందని ఇలా ఆవిర్భావ సభ వేడుకగా జాతీయ రాజకీయాలపై తనకున్న మక్కువను బయటపెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే జాతీయ స్థాయిలో పవన్‌కు ఎన్డీఏ తరఫున ఢిల్లీ పెద్దలు మోదీ, అమిత్ షా కీలక పదవి కూడా కట్టబెట్టే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఎప్పుడేం జరిగినా అభిమానులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఇప్పటికే సేనాని తన ప్రసంగంతో చెప్పకనే చెప్పేశారు కూడా.
దీంతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసినా, రాజ్యసభకు పవన్ కళ్యాణ్ వెళ్లినా ఈ రెండు పరిణామాలను చూసి ఆశ్చర్యపోనక్కర్లేదని జనసేన పెద్దలు గుసగుసలాడుకుంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Also Read: CM Revanth reddy: అయ్యింది ఇంటర్వెల్లే… కేసీఆర్ పాపాల చిట్టా ఇంకా విప్పుతా! రెచ్చిపోయిన రేవంత్