Fire Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బాణా సంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలిలో సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది.
అగ్నిప్రమాదంలో మృతి చెందిన 8 మంది వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో తాతబాబు (50), గోవింద (45), రామలక్ష్మి (38), నిర్మల (36), పురం పాపా (40), బాబు (40), బాబురావు (56), మనోహర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరోవైపు ఘటనా స్థలిని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పరిశీలించారు. క్షతగాత్రుల కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
తారాజువ్వల తయారు చేసే కర్మాగారంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. కర్మాగారంలో బాణాసంచా తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఘటనా స్థలంలో 30 మంది ఉండగా.. 15మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ పేలుడు సంభవించడంతో పలువురి శరీర భాగాలు 500 మీటర్లు ఎత్తున ఎగసిపడి తునాతునకలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులను నర్సీ పట్నం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: East Godavari district: ఏపీలో అత్యంత దారుణం.. అప్పు ఇస్తే చంపేశారు..
అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనిత (Vangalapudi Anitha)తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని సీఎం ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఘటనపై విచారణ చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అత్యవసరమైన అన్ని రకాల వైద్య సేవలు బాధితులకు అందేలా చూడాలని, బాధితుల ఆరోగ్య పరస్థితిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు.