Vijayawada Airport Fire: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కస్టమ్స్ అధికారుల గది పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇమ్మిగ్రేషన్ గదిలోని స్ప్లిట్ ఎయిర్ కండీషనర్, కస్టమ్స్ అధికారుల లగేజ్ బ్యాగులు దగ్దమయ్యాయి.
మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. దీంతో ఎయిర్ పోర్టులోని ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరించలేదు. అగ్నిమాపక సిబ్బంది చురుగ్గా స్పదించడంతో పెను ప్రమాదం తప్పిందని ఎయిర్ పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది తెలియజేశారు.
Also Read: Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్
పవర్ బ్యాంక్ కారణంగా మంటలు
పది రోజుల క్రితం అంటే అక్టోబర్ 19న దిల్లీ విమానాశ్రయంలో ఇదే తరహాలో అగ్నిప్రమాదం జరిగింది. డిమాపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో లగేజీ పెడుతుండగా.. ఓ బ్యాగ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాగ్ లోని పవర్ బ్యాంక్ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కేబిన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇతర లగేజీలకు మంటలు విస్తరించకుండా అడ్డుకున్నారు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన పౌర విమానమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు.. దర్యాప్తునకు ఆదేశించారు.
