Leopard Attack: చిత్తూరులో చిరుత దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐరాల మండలం వడ్రంపల్లి గ్రామంలో ఓ లేగదూడపై దాడి చేసి చిరుత చంపేసింది. చిరుత దాడిలో లేగదూడను కోల్పోయినట్లు రైతు ఎం. కిషోర్ వాపోయారు. మేత కోసమని దూడను పొలంకు తీసుకెళ్లిన కిషోర్.. ఓ పనిమీద ఇంటికి వస్తూ దూడను అక్కడే కట్టేశాడు. తిరిగి పొలం వద్దకు వెళ్లేసరికి దూడ నిర్జీవంగా రక్తపుమడుగులో పడి ఉంది. ఒంటి మీద పులి దాడి చేసినట్లుగా గుర్తులు కనిపించాయి.
దీంతో దాడి విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి ఎం. కిషోర్ తీసుకెళ్లాడు. దీంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరణ్, వెటర్నరీ డాక్టర్ శిరీష.. రక్తపు మడుగులో ఉన్న లేగదూడను పరిశీలించారు. దాని ఒంటిపై ఉన్న గాయాలను డాక్టర్ శిరీష క్షుణ్ణంగా పరిశీలించారు. మెడ, పొట్ట భాగాల్లో అయిన గాయాల తీవ్రతను బట్టి అది చిరుత దాడి చేసినట్లు ఆమె ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read: Duvvada Couple: దువ్వాడ జంట మంచి మనసు.. కాశీబుగ్గ బాధితులకు ఆర్థిక సాయం.. మేమున్నామంటూ భరోసా!
లేగ దూడతో పాటు చుట్టుపక్కల పొలాలు పరిశీలించిన అనంతరం అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. లేగ దూడపై దాడి చేసిన మృగం చిరుతేనని తేల్చారు. చిరుత పంజా ముద్రలు, కాలి గుర్తులు పొలంలో తమకు కనిపించాయని అన్నారు. కాబట్టి చిరుతను దూరంగా పంపేవారకు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రివేళ ఎవరూ ఒంటరిగా పొలాలవైపునకు రావద్దని సూచించారు. చనిపోయిన లేగదూడకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తరపున నష్టపరిహారాన్ని అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
