Lady Aghori: లేడీ అఘోరీ ఇష్యూ చిన్నగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతకు చేరిందా? నెక్స్ట్.. పోలీసులు ఏ చర్యలు తీసుకోనున్నారు? ఇప్పటికే ఆడపిల్లల జోలికి వస్తే, ఊరుకొనేది లేదని హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్.. తన బిడ్డ గురించి స్పందించాలని యువతి తండ్రి కోరుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..
రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిచయం లేని లేడీ అఘోరీ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీకి నిరంతరం ఏదోక వివాదం చుట్టుముడుతోంది. పలుమార్లు పోలీసులతో ఘర్షణ, ఆలయ సిబ్బందితో వివాదం, ఆపై ఆత్మహత్యాయత్నం ఇలా వార్తల్లో నిలవడం లేడీ అఘోరీ స్టైల్ అని చెప్పవచ్చు. కానీ ఇటీవల ఏపీలో మకాం వేసిన లేడీ అఘోరీ తణుకుకు వెళ్ళి చేసిన హంగామా అంతా ఇంత కాదు. అక్కడి అఘోరాపై పలు ఆరోపణలు చేస్తూ.. నిరసనకు దిగారు. అంతటితో ఆగక గుంటూరులో హిందూ ధార్మిక కార్యకలాపాలు సాగిస్తున్న అనిల్ బెహరాతో వివాదం సాగింది. ఆ తర్వాత అనిల్ బెహరా సైతం సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణకు చెందిన లేడీ అఘోరీని అఘోరీ అని పిలవవద్దని, కేవలం శ్రీనివాస్ అంటూ పిలవాలని సూచించారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఏమేరకు వాస్తవం ఉందో కానీ, లేడీ అఘోరీ మాత్రం ఏపీకి మకాం మార్చి రోజుకొక సంచలనం సృష్టిస్తున్నారు. ఈ దశలోనే గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య కుటుంబీకులతో అఘోరీకి పరిచయం పెరిగింది. ఆ పరిచయం ఏకంగా కోటయ్య గారాల పట్టి అయినటువంటి కుమార్తె అఘోరీగా మారేంత వరకు వెళ్లింది. ఈ యువతి బీటెక్ చదువుతుండగా, ఆమె అఘోరీ వెంట తాను సైతం అఘోరీగా మారేందుకు వెళ్లారు. ఈ విషయమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
లేడీ అఘోరీపై మంగళగిరి పోలీస్ట్ స్టేషన్‌లో యువతి తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశారు. తన కూతురును అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా యువతి.. అఘోరీ వద్దనే ఉంటోందని, తల్లిదండ్రులు వద్దని చెబుతోందని వారు ఫిర్యాదునిచ్చారు. ఈ దశలో అఘోరీపై యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత యువతి కూడా తన తల్లిదండ్రులపై కేసు పెట్టడం విశేషం. అఘోరీ, తమ కుమార్తెకు ముందే ఫోన్ ద్వారా మాపై కేసు పెట్టమని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిందని, అందుకే యువతి స్టేషన్‌కి వెళ్లి నేను మేజర్‌ని నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను. తల్లిదండ్రులు ఆపే ప్రయత్నం చేస్తారని ముందే కేసు పెట్టిందని యువతి తల్లి ఆరోపిస్తున్నారు.
ఇలా అఘోరీ వర్సెస్ యువతి తల్లిదండ్రుల మధ్య విమర్శలు ఊపందుకున్నాయి. పలు వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే అఘోరీగా మారిన యువతి కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు పుకార్లు వినిపిస్తున్నాయి. యువతి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి, ఖరీదైన వస్తువులు, మొబైల్ ఫోన్లను అఘోరీ కొనిచ్చిందని వదంతులు వ్యాపిస్తున్నాయి. లక్ష రూపాయల కాలేజీ ఫీజు కూడా అఘోరీ చెల్లించిందంటూ ప్రచారం సాగుతోంది.
Also Read: Jangaon District: జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు? యువతి టార్గెట్ అంటూ చర్చ?
ఇది ఇలా ఉంటే ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని యువతి తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిన్న బిగ్ టీవీతో మాట్లాడిన యువతి తల్లిదండ్రులు, మా అమ్మాయిని మాకు అప్పగించండి అంటూ రోదించారు. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోనని చెప్పిన డిప్యూటీ సీఎం సార్.. స్పందించండి అంటూ యువతి తండ్రి కోటయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తే చాలు, ఈ సమస్య పరిష్కారం అవుతుందని పలువురు నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. లేడీ అఘోరీ వెంట తాను క్షేమంగా ఉన్నానని, తనకు ఎలాంటి ఆపద లేదని ఆ యువతి చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.