Kommineni: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasarao) గుంటూరు జైలు నుంచి విడుదల అయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో కొమ్మినేనికి మంగళగిరి కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కాగా, సాక్షి ఛానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పలువురి ఫిర్యాదుతో గుంటూరు తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. జర్నలిస్టు కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని బెయిల్ ఇచ్చింది. దీంతో సోమవారం రాత్రి కొమ్మినేని జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు బయట కొమ్మినేనిని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu), పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఓ రేంజిలో రెచ్చిపోయారు.
Read Also- Journalist Arrested: అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

చీమకు కూడా హాని చేయని..
‘ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. సుప్రీం కోర్టులో (Supreme Court) జరిగిన వాదనలు అనంతరం ఆయన్ను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసు (SC, ST Case) నమోదు చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదని కొమ్మినేని శ్రీనివాసరావుపై కక్ష్యగట్టి అరెస్ట్ చేశారు. చీమకు కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్టును జైల్లో పెట్టడం దుర్మార్గం. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని, కృష్ణంరాజుపై అమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత (Home Minister Anitha) కేవలం మైక్ ముందే హోం మంత్రి. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదని హోం మంత్రి మాట్లాడడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులను కోడా వదలట్లేదు. చీకటి పడిన తర్వాత కొమ్మినేనిని విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్.. జైలు అధికారులకు ఆదేశాలిచ్చారు. పోలీసులతో మమల్ని అణచలేరు. చంద్రబాబు నూతన వికృత సంప్రదాయం తీసుకొచ్చారు’ అని ఓ రేంజిలో అంబటి హడావుడి చేశారు. మరోవైపు.. అడ్వకేట్ రోల్లా మాధవి మాట్లాడుతూ నెలలో రెండవ శనివారం, నాలుగవ శనివారం సంతకం చేయటం కోసం రావాలని కోర్టు ఆదేశించదని చెప్పారు. వేరే దేశం వెళ్లకూడదు అని.. ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ అడిగినట్లు మీడియాకు వెల్లడించారు.

పోలీసులకు అక్షింతలు..
కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం నాడు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘ టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పోలీసులకు అక్షింతలు వేసింది. మరోవైపు.. మంగళగిరి అడిషనల్ కోర్టు సైతం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ డిబేట్‌లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు.
Read Also- Bail to Kommineni: కొమ్మినేనికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
