స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్: Vangaveeti Radha Krishna: వంగవీటి ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. వంగవీటి మోహనరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉంటూ, ఆ వర్గం హక్కులపై పోరాటాలు చేసిన వ్యక్తి. ఆయన మరణాంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగవీటి రాధాకృష్ణ ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఎన్ని పార్టీలు మారినా, ఆయన అధికార పార్టీలో ఉన్నా అదృష్టం కలిసి రావట్లేదు.
దీంతో వంగవీటి పేరు క్రమేణా కనుమరుగవుతోందనే ఆందోళనలో ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ఊహించని రీతిలో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. పార్టీలోనే ఉండుంటే ఎమ్మెల్యే, ఎంపీ సీటు రాకపోయినా ప్రాధాన్యత ఉండే పదవి అయితే పక్కా అని అభిమానులు చెప్పుకున్నారు. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు కనీస గౌరవం దక్కలేదని, తన సేవలను గుర్తించలేదని తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లుగా ఇన్‌సైడ్ టాక్.
వాట్ నెక్స్ట్?
టీడీపీ కూటమి తరఫున ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఎంతో ఆశపడ్డారు కానీ, కొన్ని సమీకరణల దృష్ట్యా వీలుకాలేదు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఏదో పదవి కట్టబెడతారని భావించారు. అయితే రాజ్యసభ, రెండుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఎక్కడా ఆయన్ను పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాదు కనీసం నామినేటెడ్ పదవుల విషయంలో కూడా న్యాయం జరగలేదు.
AlsoRead: Ayyanna Patrudu on YCP: దొంగల వలె కాదు.. దొరల్లా రండి.. వైసీపీకి స్పీకర్ క్లాస్
దీంతో ఇక ఏ పార్టీలోకి వెళ్లినా ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలిసింది. ఈ మధ్యనే రంగ, రాధా మిత్రమండలి సమావేశంలో నైరాశ్యంతో మాట్లాడటం, తన సన్నిహితులతో కూడా రాజకీయాలంటే అసంతృప్తితో మాట్లాడటంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు బయటికొచ్చాయి.
అయితే కాస్త ఈ విషయంలో ఆలోచించాలని కొందరు సన్నిహితులు చెప్పగా, ఇన్నాళ్లు వేచి చూశారుగా ఇంకాస్త ఓపిక పట్టాలని మరికొందరు సూచించారట. దీంతో ఆయన కాస్త వెనకడుగు వేసినట్లుగా తెలుస్తున్నది. రాజకీయాలకు గుడ్ బై చెబితే మాత్రం వ్యాపారాలు చూసుకోవాలనే యోచనలో ఉన్నారని సమాచారం.
Also Read: Rana Daggubati: దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్‌లపై కేసు నమోదు.. ఏంటి ఇంత సీరియస్‌గా తీసుకున్నారా?