AP Heavy Rains Alert: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా బెంగాల్ తీరాలకు దగ్గరగా ఉపరితలం ఆవర్తనం ఏర్పడ్డ నేపథ్యంలో.. ఉత్తరాంధ్ర జిల్లాలో దీని ప్రభావం అధికంగా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ఫలింతంగా రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మంగళవారం ఆ జిల్లాల్లో వర్షం..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రేపు (ఆగస్టు 26) అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
Also Read: Viral Video: 25 ఏళ్ల యువతిని వేధించిన ఏడేళ్ల బాలుడు.. విలపిస్తూ వీడియో పెట్టిన బాధితురాలు!
బుధవారం రోజున..
బుధవారం రోజున విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వివరించింది.
Also Read: Viral News: ఓర్నాయనో.. ఆటోలో 1 కి.మీ ప్రయాణానికి.. రూ.425 వసూల్!
తెలంగాణలో రెయిన్ అలర్ట్
ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న మూడు రోజులలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని అభిప్రాయపడింది. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబాబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశముందని తెలిపారు.
Also Read: Viral Video: రీల్స్ కోసం వెర్రి వేషాలు.. కళ్లముందే కొట్టుకుపోయిన యూట్యూబర్!