Borugadda Anil Kumar: గత వైసీపీ హయాంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బోరుగడ్డ అనిల్.. తాజాగా ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాన్, ఆయన ఫ్యామిలీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన బోరుగడ్డను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆయన జైల్లో గడిపారు. ఇన్నాళ్లు తానూ వైసీపీ నేతను అని చెప్పుకుంటూ తిరిగిన అనిల్ కు ఇటీవల ఆ పార్టీ ఝలక్ సైతం ఇచ్చింది. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పవన్ విషయంలో బోరుగడ్డ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తానూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ ఓ ఇంటర్వ్యూలో అతడు చేసిన కామెంట్స్ ఏపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నేనూ పవన్ అభిమానినే: బోరుగడ్డ
రాష్ట్రంలోని ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బోరుగడ్డ అనిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమాననంటూ చెప్పుకొచ్చారు. ఇంటర్ చదివే రోజుల్లో 200-300 పవన్ సినిమా టికెట్లు తీసుకొని.. ఫ్రీగా పంచినట్లు ఆయన తెలిపారు. అయితే పవన్ ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తూ వచ్చానని బోరుగడ్డ అనిల్ అన్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు ఎందుకు చూడకూడదని బోరుగడ్డ అని అన్నారు. చూడొద్దని పవన్ ఏమి చెప్పలేదు కదా అని పేర్కొన్నారు. ఒకవేళ తాను చూస్తానంటే నా ఇంటికి రీల్ పంపంచి సినిమా ప్రదర్శించినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే: బోరుగడ్డ అనిల్ కుమార్
ఇంటర్ చదివే రోజుల్లో పవన్ సినిమా టికెట్లు కొని ఫ్రీగా పంచాను
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తాను
– బోరుగడ్డ అనిల్ కుమార్ pic.twitter.com/9mjR6ojxe7
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2025
జనసేనలో చేరతారా?
వైసీపీ అధినేత జగన్ కు తాను భక్తుడినని తొలి నుంచి చెప్పుకుంటూ తిరిగిన బోరుగడ్డ అనిల్ ను తమవాడు కాదంటూ ఆ పార్టీ ఇటీవల దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటన్న ప్రశ్నలు మెుదలయ్యాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో అసందర్భంగా పవన్ అభిమానినంటూ ఆయన ప్రస్తావన తీసుకొని రావడం చూస్తే ఆయన జనసేనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలుశిక్ష అనంతరం తనలో మార్పు వచ్చిందని బోరుగడ్డ చెప్పకనే చెప్పారు. ఇకపై తన నోటి నుంచి ఎలాంటి అభ్యంతరకమైన మాట వచ్చిన రూ.కోటి ఇస్తానని ఛాలెంజ్ చేసారు. గతంలో విచారణ సందర్భంగా వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే తాను చదివానంటూ పరోక్షంగా తాను అమాయకుడ్ని అని చెప్పకనే చెప్పారు. అయితే అతడు జనసేనకు దగ్గరవ్వాలని ప్రయత్నించినా.. పవన్ ఇందుకు అంగీకరించే ప్రసక్తే లేదని జనసేన కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. జనసేన వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా బోరుగడ్డ చేయరని స్ఫష్టం చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan on YCP: అధికారంలోకి వస్తాం.. చంపేస్తామంటే భయపడతామా? పవన్ మాస్ వార్నింగ్!
‘నన్ను చంపాలని చూశారు’
ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో మరిన్ని కీలక విషయాలను బోరుగడ్డ అనిల్ వెల్లడించారు. జైలులో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తెలిపారు. ఓ లేడీ కానిస్టేబుల్ చేత తన ప్రైవేటు పార్ట్స్ పై కొట్టించినట్లు ఆరోపించారు. తనను చంపాలని కూడా చూసారని బోరుగడ్డ సంచలన కామెంట్స్ చేశారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సందర్భంలో రికార్డైన సీసీ కెమెరా ఫుటేజీని లోకేశ్, పవన్ కళ్యాణ్, డీజీపీలకు పంపారని అనిల్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా తన ఆస్తులను జప్తు చేసి, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని బోరుగడ్డ అన్నారు. తనను రోడ్డుపైకి లాగేశారని వాపోయారు. తన అత్త, మామ ఇంటిపై కూడా దాడులు జరిగాయని, లండన్ లో సెటిల్ అయిన తన చెల్లెళ్లకు నోటీసులు పంపారని పేర్కొన్నారు. జగన్ కు సపోర్ట్ చేయడమే నేను చేసిన మహా పాపమా? అంటూ బోరుగడ్డ నిలదీశారు. నాపై 22 కేసులు ఉన్నాయన్న ఆయన.. ఒకటి తప్ప అన్నీ సోషల్ మీడియా కేసులేనని చెప్పారు.

