AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకటి పోతే మరొకటి ఇష్యూలు తెరపైకి వస్తున్నాయి. ఓ వైపు అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ‘హెలికాప్టర్’ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడిదే కూటమి పార్టీలు, వైసీపీ మధ్య చర్చకు.. అంతకుమించి రచ్చకు దారితీసింది. ఈ హెలికాప్టర్ విషయంలో వైసీపీ (YSRCP) ఏమంటోంది? టీడీపీ, జనసేన (TDP, Janasena) పార్టీలు ఏం ఆరోపిస్తున్నాయి? సీఎం చంద్రబాబు (CM Chandrababu) కొత్త హెలికాప్టర్ కొంటున్నారన్న వార్తల్లో నిజమెంత? ఇదంతా సొంత డబ్బులా? ప్రజల పన్నుల నుంచి వచ్చినవా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం..
Read Also- YS Jagan: వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్ర.. అవసరమేనా?
ఎందుకీ రచ్చ..?
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు.. అడుగు తీసి అడుగు పెట్టాలంటే చాలు హెలికాప్టర్లలో ఆకాశమార్గాన తప్ప.. రోడ్డు మార్గాన వెళ్లడానికి అస్సలు ఇష్టపడటం లేదన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఈ ముగ్గురు ప్రభుత్వ పెద్దలు మూడు స్పెషల్ హెలికాప్టర్లలో తెగ తిరిగేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు, నెటిజన్లు తీవ్ర ఆరోపణలే చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కూడా. ప్రజలకు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వడానికి లేవని లబోదిబోమన్న చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు ప్రత్యేక హెలికాప్టర్లలో తిరగడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఇదంతా ప్రజాధనం వృధా చేయడం కాదా?, కొంపదీసి దీన్నే సంపద సృష్టి అని కొత్తగా అంటున్నారా? అని సామాన్య ప్రజలు సైతం దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి.
నాడు ఒకటి.. నేడు మూడు!
ఇదే క్రమంలో వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఒక్క హెలికాఫ్టర్ వాడితేనే ఓ రేంజిలో టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి విమర్శలు వచ్చాయి. గతంలో ‘లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ’.. ‘వామ్మో.. జగన్ ఫ్లైట్ ఖర్చు ఇన్ని కోట్లా?’ ఇలా ఎన్నో వార్తలు వడ్డించిన వార్తలను గుర్తు చేస్తూ.. నాడు జగన్ ఒక్కడే ఫ్లైట్ వాడితే, నేడు ముగ్గురు మూడు హెలికాప్టర్లు వాడుతున్నారు కదా? అని వైసీపీ ప్రశ్నిస్తున్నది. గత ప్రభుత్వంలో ఒక్క హెలికాప్టర్‌కే ప్రభుత్వ ధనం వృధా అయితే.. ఈ ప్రభుత్వంలో ఏకంగా ముగ్గురు మూడు హెలికాప్టర్లు వాడుతున్నారు కదా? ఇప్పుడు వృథా కాకుండా సంపద సృష్టి ఏమైనా జరుగుతోందా? పోనీ సొంత డబ్బులు ఏమైనా ఖర్చుపెడుతున్నారా? అదే నిజమైతే చూపించండి అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆఖరికి ‘అన్‌స్టాపబుల్’ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి కూడా అమరావతి నుంచి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారని మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆ మధ్య జత్వానీ విషయంలోనూ ఇలానే జరిగిందని విమర్శలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చీటింగ్ కేసులు ఉన్న ముంబై మోడల్, హీరోయిన్ జత్వానీని ఏకంగా స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు రప్పించారని, ఆమెపై పెట్టిన, ఉన్న శ్రద్ధ ఏపీలోని ఆడ బిడ్డలపై ఎందుకు లేదు చంద్రబాబు? అని రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
బాబు.. కొత్త ఫ్లైట్ కథేంటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనల నిమిత్తం కొత్త హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేస్తున్నారన్నది కొద్దిరోజులుగా నడుస్తున్న బర్నింగ్ ఇష్యూ. ఇందుకు సంబంధించి ఆర్థిక, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీసీఏ అధికారులతో కూడిన కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ పనితీరు, కొత్తగా కొనుగోలు చేయాలని భావిస్తున్న హెలికాప్టర్ విషయంపైనా సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఎందుకీ హెలికాఫ్టర్ కొనుగోలు చేస్తున్నారనే ప్రశ్నకు.. జూన్ నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్ట్ సందర్శన ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చంద్రబాబు వెళ్లాల్సి ఉంటుందని.. సీఎం పర్యటనతో పనులు మరింత జోరుగా జరుగుతాయన్నది టీడీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే ఇప్పుడున్న హెలికాఫ్టర్ అంత అనుకూలంగా లేదని అందుకే కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారని చర్చ నడుస్తున్నది. అసలే సంక్షేమ పథకాల అమలు విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో కూడా అసంతృప్తి గట్టిగానే ఉంది.. ఈ పరిస్థితుల్లో హెలికాఫ్టర్ కొనుగోలు ఎంతవరకూ కరెక్ట్? ఆ డబ్బులు ఏదో ఒక పథకానికి సరిపోతుంది కదా? ఇలా చేస్తే కొంతలో కొంతైనా ప్రజలు మేలు జరుగుతుందనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.
Read Also-Samantha: వామ్మో.. వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేసిన సమంత.. పెద్ద రచ్చే జరుగుతోందిగా!
గత ప్రభుత్వం లో ఒక్క హెలికాప్టర్ కే ప్రభుత్వ ధనం వృధా ఐతే….
ఈ ప్రభుత్వం లో ముగ్గురు మూడు హెలికాప్టర్ లు వాడుతున్నారు. ఇప్పుడు వృథా కాకుండా సంపద సృష్టి ఏమైనా జరుగుతుందా?
సొంత డబ్బులు ఖర్చుపెడుతున్నారు అంటే చూపించండి.#WalkTheTalk pic.twitter.com/4TBaLDLZpA
— Just a thought (@Think_Blink09) May 14, 2025