Bhogapuram Airport: ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది. ఇతర ప్రాంతాలతో ఉత్తరాంధ్ర అనుసంధానానికి ముఖద్వారంగా భావిస్తున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) ప్రారంభానికి మార్గంసుగుమం అయ్యింది. ఈ మేరకు ఆదివారం నాడు వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. వ్యాలిడేషన్ ఫ్లైట్ అంటే ఒక కొత్త విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధంగా ఉందో లేదో తనిఖీ చేసే చివరి టెస్ట్. ఈ పరీక్షలో ఎయిర్‌పోర్టులోని రన్‌వే, సిగ్నలింగ్ వ్యవస్థ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలిస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం ఈ పరీక్ష చేపడతారు. నిబంధనల ప్రకారం, ఢిల్లీ నుంచి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐసీ3198 విమానాన్ని తీసుకొచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టులో సక్సెస్‌ఫుల్‌గా ల్యాండింగ్ చేశారు. ఈ స్పెషల్ ఫ్లైట్‌లో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు, జీఎంఆర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తికావడంతో, మిగతా సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ఏడాది జూన్ నెలలో విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురానున్నారు.
సీఎం చంద్రబాబు హర్షం
భోగాపురం ఎయిర్‌పోర్టులో వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండింగ్ కావడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఏపీ విమానయాన రంగంలో ఇవాళ ఒక కొత్త మైలురాయిగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. జూన్ నెల నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు జనాలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాంతీయ అనుసంధానతను మెరుగుపరచడమే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయేందుకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న నిబద్ధత, దార్శనికత, నాయకత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 2014-2019 మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ఎయిర్‌పోర్టుకు ప్రణాళిక రూపొందించి ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Read Also- Drainage Problem: రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు.. రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
Congratulations to the people of Andhra Pradesh, especially Uttarandhra, on the successful validation flight of the Bhogapuram Greenfield International Airport. Today marks a new milestone for aviation in the state, strengthening regional connectivity and giving a major boost to… pic.twitter.com/ujUaKasVsV
— N Chandrababu Naidu (@ncbn) January 4, 2026
మేం చేసిన కృషి.. ఇవాళ కీలక మైలురాయి: వైఎస్ జగన్
భోగాపురం ఎయిర్‌పోర్టులో వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండింగ్ కావడం పట్ల మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ‘‘కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి’’ అని వ్యాఖ్యానించారు. విజన్ వైజాగ్ (VisionVizag) లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని ఆయన అభివర్ణించారు. ‘‘ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూపునకు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చినవారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. తద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

