Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Midhun Reddy) అరెస్ట్‌తో కీలక పరిణామం చోటుచేసుకోగా, త్వరలోనే ‘పెద్ద తిమింగలం’ అరెస్ట్ అవుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రక్రియ కూడా అతి త్వరలోనే చోటుచేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. జైల్లో ఉన్న నిందితులు బెయిల్ కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం నాడు కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ సందర్భంగా అటు ధనుంజయ రెడ్డి.. ఇటు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కోర్టులో తమ ఆవేదన చెప్పుకొని కంటితట్టి పెట్టుకున్నారు. విచారణ అనంతరం ఈనెల 24కు కోర్టు వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ధనుంజయరెడ్డి ఆవేదనతో ఏం చెప్పుకున్నారు? చెవిరెడ్డి ఎందుకు కంటతడి పెట్టారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం రండి..!
కర్త, కర్మ, క్రియ వాళ్లే!
జడ్జి ఎదుట జైల్లో జరిగిన, జరుగుతున్న విషయాలను చెబుతూ ధనుంజయరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఆ విషయాలన్నీ కోర్టు బయట మీడియాకు చెప్పుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ‘ మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్‌పై నుంచి మమ్మల్ని ఫొటోలు తీస్తున్నారు. పైనుంచి అడిగితే మేం ఫొటోలు తీస్తున్నామని చెబుతున్నారు. మాజీ సీఎస్, మాజీ ఫారెస్టు కన్జర్వేటర్ నా బినామీలు అని వార్తలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, జీవితం గడుపుతున్నట్టు కథనాలు రాస్తున్నారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్కటి శాంత్రో కారు. నా భార్య వాడుతున్న మరో కారు మాత్రమే నాకు ఉన్నాయి. ఇవి విలాసవంతమైన కార్లా? గత 20 రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలు చూస్తే మేం ఛార్జ్‌షీట్ చదవాల్సిన అవసరం లేదు. ఛార్జ్‌షీట్‌లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాసేశారు. ఇది కచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపటి నుంచి సిట్ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా సరే, అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు’ అని ధనుంజయ రెడ్డి ఆవేదనకు లోనయ్యారు.
Read Also- Love Marriage: ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని.. కానిస్టేబుల్ జాబ్ వచ్చాక!
కోర్టులో కంటతడి!
విజయవాడ ఏసీబీ కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదని.. భవిష్యత్తులో కూడా వెళ్లబోనని కోర్టుకు మాజీ ఎమ్మెల్యే వివరించారు. తాను చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగుతోందని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసిందని.. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిందని చెబుతున్నారు. కాగా, ఈ కేసులో చెవిరెడ్డిని సిట్ ఏ38గా చేర్చిన సంగతి తెలిసిందే.
మిథున్ అరెస్ట్ హేయమైన చర్య
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్ట్ హేయమైన చర్య అని, ఇది కూటమి ప్రభుత్వ కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయంలో భాగమేనని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు మండిపడ్డారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ అక్రమ మద్యం కేసు అని, దానికి ఎలాంటి మూలాలు లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా బోడిగుండుకు మోకాలికి ముడివేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అధినేత జగన్ రెడ్డికి అండగా నిలిచిన వారి పేర్లును రెడ్‌బుక్‌లో రాసుకుని వారినే టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు. సిట్ అధికారులు చంద్రబాబు, లోకేష్ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా..? డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రైవేట్ ముసుగులో మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. బెల్టుషాపులు నిర్వహించి గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదా? ఈ విషయంలో చంద్రబాబుపై కేసు పెడితే ప్రస్తుతం బెయిల్ మీదే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని విజయరాజు వెల్లడించారు.
Read Also- Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అదిరిపోయే పథకం.. త్వరగా తెలుసుకోండి!
