Cyclone Montha Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన మెుంథా తుపాను.. ప్రచండ గాలులతో ఏపీ తీరాన్ని తాకింది. తీరాన్ని దాటే ప్రక్రియ మొదలైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో, ప్రస్తుతం ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటనున్న ప్రదేశాలు కాకినాడ, దాని పరిసర జిల్లాల్లో గాలుల తీవ్రత గంటగంటకు తీవ్రతరం అవుతోంది. రాజోలు, అల్లవరం మధ్య ఈ తీవ్ర తుపాను తీరాన్ని తాకే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారుల తాజాగా అంచనా వేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు సుమారుగా 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మరోవైపు విశాఖలోనూ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భీకర గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
అంధకారంలో మచిలీపట్నం
మొంథా తుపాను తీరాన్ని తాకిన నేపథ్యంలో, మచిలీపట్నం అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మచిలీపట్నం తీర ప్రాంతంలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలులతో పాటు ఎడతెరిపిలేని వర్షం కారణంగా విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలు తెగిపడిన విద్యుత్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక హెచ్చరికల పాటించాలని అధికారులు సూచించారు.
రాగల 12 గంటలు వానలు దబిడిదిబిడే!
ఏపీలో రాగల 12 గంటలపాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. రాగల ఈ 12 గంటలు చాలా కీలకమని, చాలా అప్రమత్తంగా ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) సూచించింది. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 120 కి.మీ.ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు, ఈదురు గాలులకు ప్రభావితం అయ్యే ప్రాంతాల్లో మచిలీపట్నం, దివిసీమ, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వానలు, గాలులు తీవ్ర విధ్వంసం సృష్టించనున్నాయి. ఇక, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
గోదావరి జిల్లాల్లోనూ ప్రభావం గట్టిగానే ఉండనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల గంటకు 80-90 కి.మీ.ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో 100 కి.మీ.ల వేగం కూడా ఉండవచ్చు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు ప్రాంతాలన్నీ భారీ గాలులు, వర్షాలతో ప్రభావితం కానున్నాయి. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొండ ప్రాంతాల్లో గాలుల ప్రభావం కంటే వర్షపాతం ఎక్కువగా ఉంటుందని ‘ఆంధ్రప్రదేశ్ వెధర్‌మ్యాన్’ పేర్కొంది. ఉత్తర ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, బాపట్ల ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి.

మొంథా ఎఫెక్ట్… 120కిపైగా రైళ్లు రద్దు
తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో ఏపీలో పెద్ద ఎత్తున రైళ్ల సేవల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ భారతదేశంలో ప్రభావిత ప్రాంతాల్లో 120కి పైగా రైళ్లు రద్దు అయ్యాయి. తీరం వెంబడి తుపాను తీరం దాటే ప్రక్రియను మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో రైలు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తుపాను తీవ్ర పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 122 రైళ్లు రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఏ. శ్రీధర్ ప్రకటించారు. మరో 29 రైళ్లు రీషెడ్యూల్ చేశామని, ఎనిమిది రైళ్లను దారి మళ్లించామని వెల్లడించారు. ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాల్లో నెలకొన్న తుపాను పరిస్థితుల కారణంగా ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. మొత్తం మీద, సుమారుగా 160 రైళ్లు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు.
తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న విశాఖపట్నం, విజయవాడ మధ్య నడిచే సర్వీసులే ఎక్కువగా ప్రభావితమయ్యాయని ఏ.శ్రీధర్ పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై నుంచి హౌరా, అసోం, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు. తాజా సమాచారం కోసం ప్యాసింజర్లు రైల్వే ఎంక్వైరీలను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్‌లో వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో తదుపరి 2 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ వానలు పడతాయి. రాత్రి సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరింత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది.
పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత
మొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ నిరంతరం నివేదికలు విశ్లేషించి అధికారులతో చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట తదితర తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించారు. 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం పిఠాపురం నియోజకవర్గంలో అప్రమత్తంగా ఉంది.
7 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ
మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ జిల్లాల్లో రాత్రి 8.30 గంటల తర్వాత వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అధికారులు కోరారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారులు అభ్యర్థించారు. ఈ మేరకు విజయవాడలోని ‘డైరెక్టర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ డిపార్ట్‌మెంట్’ ఆదేశాలు జారీ చేసింది. ఈ జిల్లాలపై తీవ్రమైన ప్రభావం ఉండొచ్చని ఆర్టీజీఎస్ (ది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) హెచ్చరించింది.
కర్ప్యూ జిల్లాలు ఇవే
నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభావిత జిల్లాల జాబితాలో కృష్ణా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని భాగాలు (చింతూరు, రంపచోడవరం డివిజన్లు) ఉన్నాయి.
తుపాను ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన ఈదురు గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వరి, బొప్పాయితో పాటు పలు పంటలు నేలకొరిగాయి.
కాకినాడ పోర్టుకు రెడ్ అలర్ట్
తీవ్రమైన తుపాను మొంథా తీరం దాటనున్న నేపథ్యంలో కాకినాడ పోర్టుకు 10వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. అంటే, ఇక్కడ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇది అత్యధిక స్థాయి హెచ్చరికగా పరిగణిస్తారు. గాలివేగం, సముద్ర అలల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇతర తీరప్రాంత పోర్టులైన విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం ప్రాంతాలకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా బలమైన గాలులతో పాటు భారీ వర్షపాతం నమోదు కానుందని అధికారులు తెలిపారు. అయితే కాకినాడతో పోలిస్తే తీవ్రత కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
సైన్యాన్ని దించుతాం: లోకేశ్
ఏపీ దిశగా మెుంథా తుపాను దుసుకొస్తున్న వేళ.. ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh).. హోంమంత్రి అనిత (Vangalapudi Anita)తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సైక్లోన్ (Cyclone)ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం (AP Govt), మంత్రులు, అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) సైతం ఏపీ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారని.. తుపానుకు సంబంధించిన పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా అకస్మికంగా వాగులు, వంకలు ఉప్పొంగవచ్చని.. కాబట్టి ఆయా ప్రాంతాలను గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు. అంతేకాదు అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామని లోకేశ్ స్పష్టం చేశారు.
అర్ధరాత్రికి కాకినాడ తీరానికి..
మెుంథా తుపాను ప్రస్తుతం గంటకు 15 కి.మీ వేగంతో తీరం వైపునకు కదులుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఇవాళ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకొని తీరం దాటే అవకాశముందని అధికారులు చెప్పినట్లు లోకేశ్ తెలియజేశారు. ఈ తుపాను.. ఏకంగా 40 లక్షల మందిని ప్రభావితం చేసే ప్రమాదముందని లోకేశ్ అంచనా వేశారు. కాబట్టి ప్రజలు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రమాద హెచ్చరికలు జారీ
తుపాను ప్రభావంతో కాకినాడ, విశాఖ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ ఓడరేవు వద్ద 10వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదే సమయంలో విశాఖ పోర్ట్ కు 9 నెంబర్, నరసాపురం పోర్ట్ కి 8వ నెంబర్ హెచ్చరికలు ఇచ్చారు. ప్రస్తుతానికి మెుంథా తుపాను.. మచిలీపట్నంకి 60 కి.మీ, కాకినాడకి రూ.140 కి.మీ, విశాఖపట్నానికి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
Also Read: Weather Update: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?
‘మెుంథా’ అంటే అర్థం తెలుసా?
‘మెుంథా (Montha)’ అనే పదం థాయి బాష నుంచి ఆవర్భివించింది. దీనికి అర్థం అందమైన లేదా సువాసన గల పువ్వు. ఈ పేరును థాయ్‌లాండ్ (Thailand) సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు (Regional Specialised Meteorological Centres – RSMCs), 5 ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరిక కేంద్రాలు (Regional Tropical Cyclone Warning Centres) ఉన్నాయి. తుపానులకు పేర్లు ఇవ్వడం హెచ్చరికలు జారీ చేయడం ఈ కేంద్రాల బాధ్యత.
