Chandrababu Review
అమరావతి, ఆంధ్రప్రదేశ్

Chandrababu: ధర తగ్గొద్దు.. కొనుగోళ్లు ఆగొద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు పండించిన రైతులు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోకూడదని.. పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే కొనుగోళ్లను కూడా ఆపకూడదని, రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న పంట కొనుగోళ్లను వెంటనే జరపాలని స్పష్టం చేశారు. తాను రైతులు, పరిశ్రమలు-సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని, అలా అని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని చెప్పారు. ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేది లేదని.. చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని ముఖ్యమంత్రి కొనుగోలుదారులను హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రి పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు-గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పొగాకు ధర పతనం కావడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూసి రైతుల్లో అధికారులు నమ్మకం నింపాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేశారు.

టార్గెట్ ఇదీ..
హెచ్‌డీ బర్లే పొగాకును నాణ్యత ఆధారంగా క్వింటాల్‌కు రూ.12,500కు కంపెనీలు కొనుగోలు చేయాలి. జీపీఐ, ఐటీసీ కంపెనీలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోళ్లను ప్రారంభించాలి. కంట్రోల్ రూమ్, వాట్సప్ గ్రూప్ ద్వారా రోజువారీగా కొనుగోళ్లను పర్యవేక్షించాలి. వ్యవసాయ శాఖ ప్రతి రెండు రోజులకు ఒకసారి కొనుగోలు వివరాలను నివేదించాలి. వచ్చే సాగు సీజన్‌లో అంతర్జాతీయ డిమాండ్, ధరల ఆధారంగా హెచ్‌డీ బర్లే సాగు విస్తీర్ణాన్ని నియంత్రించేలా, ఈరకం సాగు వైపు మళ్లకుండా రైతుల్లో అవగాహన పెంచేందుకు 2025 జూన్ నుంచి సమావేశాలు నిర్వహించాలి. రైతుల ఇళ్లల్లోనూ, పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు కొనుగోళ్లు జరగకుండా మిగిలిపోకూడదు. తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేసి అవసరమైతే గోడౌన్లలో నిల్వ ఉంచుకోవాలి. కొనుగోళ్లు ఏస్థాయిలో జరుపుతున్నారు? ఎంతమేర ధర చెల్లిస్తున్నారు? అనే నివేదిక సోమవారం కల్లా ఇవ్వాలి. రైతుల్లో అసంతృప్తి రావడానికి వీల్లేదు.. వారు ఏవిధంగానూ నష్టపోకూడదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎఫ్‌సీవీ, వైట్ బర్లీ, హెచ్డీ బర్లీ.. ఈ 3 రకాల పొగాకు కలిపి 2024-25 కాలంలో రాష్ట్రంలో 1,90,456 హెక్టార్లలో సాగు చేశారని.. 450 మిలియన్ కేజీల దిగుబడి వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇది అత్యధిక పంట దిగుబడి అని, మిగిలిన పంటల నుంచి పొగాకు సాగు వైపు రైతులు మొగ్గు చూపించడంతో అనూహ్యంగా ఉత్పత్తి రెట్టింపై సమస్య ఉత్పన్నం అయ్యిందన్నారు.

Chandrababu Meeting

మాయాజాలం వద్దు..
పొగాకు ధర పతనం కాకుండా చర్యలు తీసుకోవడంలో పొగాకు బోర్డు విఫలమైంది. జీపీఐ, ఐటీసీ వంటి ట్రేడర్లతో సరైన సమన్వయం లేదు. అత్యధిక ధరలు ఆశ చూపించి రైతులు పొగాకు సాగు చేసేలా చేస్తున్న కంపెనీలు, తీరా పంట చేతికి వచ్చేసరికి అమాంతం ధరలు తగ్గించడం సరికాదు. కనీస మద్దతు ధర కల్పించకుండా సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యను అధిగమించాలంటే బైబ్యాక్ పాలసీ ఉత్తమం. ఇకపై కంపెనీలతో రైతులు బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలి. బైబ్యాక్ విధానం అమలు, కొనుగోళ్లు జరిగేలా పొగాకు బోర్డు పర్యవేక్షించాలి. గ్లోబల్ డిమాండ్, సప్లయ్‌కు అనుగుణంగా ధర నిర్ణయించి రైతులకు లాభాలు వచ్చేలా చేయాలి. గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతులు పూర్తిగా పొగాకు పండించడం మానేస్తారు. అప్పుడు కంపెనీలన్నీ మూతపడే పరిస్థితి తలెత్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చంద్రబాదబు హెచ్చరించారు. ఈ సందర్భంగా కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు సంస్థలు సహకరించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలుపై..
వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మిరప పంటను విక్రయించిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్కువ ధరకు అమ్మడం ద్వారా రైతులు ఎంతమేర నష్టపోయారనే దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ జాబితాలో దళారులను పూర్తిగా తొలగించి, నిజమైన రైతులను మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. మిర్చి రైతుల్లో పురుగుమందుల వినియోగం తగ్గించేలా, ఎగుమతులు తగ్గట్టు నాణ్యతాప్రమాణాలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇంకా రైతుల దగ్గర మిగిలి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే సన్న రకాలు పండించేలా రైతుల్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటివరకు ఈ రబీలో 1,41,144 మంది రైతుల నుంచి 17.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, వీరికి రూ. 3,258 కోట్లు జమ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24 రబీ కాలానికి కేవలం 10.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 49,866 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,103 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం