AP Widow Pensions: ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. దీనితో సుమారు లక్ష కుటుంబాలకు మేలు చేకూరనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందాం.
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పై కూటమి ప్రభుత్వం సరికొత్త తరహాలో ఎన్నో సంస్కరణలను చేపట్టింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే నగదు పెంచి పింఛన్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా పింఛన్ల బదిలీలకు సైతం అవకాశం ఇవ్వడంతో, పింఛన్దారులు హర్షం వ్యక్తం చేశారు. వితంతు, వికలాంగ పింఛన్లతో పాటు అన్ని పింఛన్లను పెంచడంతో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందన్న భావన గట్టిగా వినిపించింది.
తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న మరో నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు మేలు చేకూరనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ తీసుకుంటూ మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వితంతువులకు అందించే పింఛన్ పద్ధతిని ప్రభుత్వం సులభతరం చేసింది.
పింఛన్ దారుడు మృతి చెందిన మరుసటి నెలలోనే అతడి భార్యకు ఎటువంటి దరఖాస్తులు లేకుండా నేరుగా పింఛన్ పంపిణీ చేసే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మే నెల మొదటి తారీకు నుండి ఏపీవ్యాప్తంగా భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 మందికి కొత్త వితంతు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సీఎం ఆమోదించారు. దీనిపై ప్రభుత్వం సైతం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
సామాజిక పింఛన్ పంపిణీ పై ఎటువంటి అలసత్వం వహించకుండా ప్రతినెల కోట్ల రూపాయల నగదును పింఛన్దారులకు ప్రభుత్వం సచివాలయాల సిబ్బంది చేత పంపిణీ చేస్తుంది. తాజాగా కొత్త పింఛన్ మంజూరు చేయడంతో భర్తను కోల్పోయిన వితంతువుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: AP Constable Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాలపై కీలక ప్రకటన.. మీరు సిద్ధమేనా!
ఇది ఇలా ఉంటే ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ నగదు పొందుతున్న వారిని గుర్తించి వారికి పింఛన్ కట్ చేసే ప్రక్రియను సైతం ప్రభుత్వం మరోవైపు కొనసాగిస్తోంది. అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, అనారాతతో ప్రభుత్వ పథకాలు పొందితే సహించేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లుగా ఈ ప్రక్రియను బట్టి చెప్పవచ్చు.