Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో హస్తినలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై సీఎం వారితో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు జరుపనున్నారు.
Read Also-YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!
పర్యటన ఇలా..!
15న ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా 15న రాత్రి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో బస చేస్తారు. అక్కడ రాష్ట్ర అధికారులు, ఇతర ప్రముఖులతో సమావేశమవుతారు. 16న కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో సీబీఎన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నూతన పారిశ్రామిక విధానాలను వివరిస్తారు. ఇది రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు.
ఏం చేయబోతున్నారు?
కాగా, ముఖ్యమంత్రిగా తన మొదటి ఢిల్లీ పర్యటన నుంచీ తదుపరి పర్యటన వరకూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, కీలక నిర్ణయాలను వేగవంతం చేయాలనేది చంద్రబాబు ప్రధాన ఉద్దేశ్యమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి, పోలవరం పూర్తికి కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం పొందడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఇది రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్దేశిస్తుంది. రాష్ట్రంలో రక్షణ రంగ పరిశ్రమలు, తయారీ యూనిట్లను నెలకొల్పే అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేదా సంబంధిత అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి నిధుల విడుదల మందగించిన నేపథ్యంలో.. ఇప్పుడు టీడీపీ-బీజేపీ పొత్తుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, పెండింగ్ నిధులు, ప్యాకేజీలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు పదేపదే కోరుతున్నారు. దీంతో పాటు.. రాష్ట్ర విభజన హామీల అమలు, ముఖ్యంగా ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన ప్యాకేజీల నిధులు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 17న ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు పయనం కానున్నారు. తొలి రోజు పర్యటన ముగిసిన తర్వాత లేదా అమరావతికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి చంద్రబాబే స్వయంగా వివరాలు వెల్లడించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Read Also-Mayasabha: ‘మయసభ’ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్.. వారికోసమేనా?