Bhumana Karunakar Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu).. తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) తీరని ద్రోహం చేస్తున్నారని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. అలిపిరికి అత్యంత సమీపంలో ఉన్న విలువైన టీటీడీ భూములను ఒబెరాయ్ గ్రూప్ నకు కట్టబెట్టడం దారుణమని అన్నారు. అందుకు ప్రతీగా తక్కువ విలువైన పర్యాటక శాఖ భూమిని టీటీడీకి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. టూరిజం స్థలం ఎకరాకు రూ.90 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే.. టీటీడీ స్థలం గజం రూ.49 వేలు పలుకుతున్నట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎకరా రూ. 26 కోట్లు పలుకుతున్న పేర్కొన్నారు.
రూ.3 వేల కోట్లు పైనే..
అలిపిరి ప్రాంతంలో ఒబెరాయ్ గ్రూప్ నకు కేటాయించిన 20 ఎకరాలు భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.3 వేల కోట్లు ఉంటుందని భూమన కరుణాకర రెడ్డి అంచనా వేశారు. కోహినూరు వజ్రం కంటే ఎక్కువ ధర ఉండే టీటీడీ స్థలంకు వెల కట్టలేమని పేర్కొన్నారు. టూరిజం నుంచి టీటీడీ తీసుకున్న స్థలం విలువ రూ.18 కోట్లు మాత్రమేనన్న భూమన.. అందుకు ప్రతిగా వేల కోట్ల భూమిని ఒబరాయ్ గ్రూప్ నకు దోచిపెట్టారని ఆరోపించారు. శంకరయ్యను సులేమాన్ గా మార్చినట్లుగా.. ఒబెరాయ్ ముంతాజ్ హోటల్ ను ‘స్వర’గా మార్చారని కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.
ఆ భూముల్లో ఎర్రచందనం
టీటీడీ భూముల కేటాయింపునకు సంబంధించి డిసెంబర్ 13న జీవో విడుదల చేస్తే ఇంతవరకూ దానిని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురాలేదని భూమన మండిపడ్డారు. ఆ 20 ఎకరాల భూముల్లో అత్యంత విలువైన ఎర్ర చందనం చెట్లు సైతం ఉన్నట్లు భూమన ఆరోపించారు. స్వయంగా తాను వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. ‘100 గదులతో రూపొందనున్న ఒబెరాయ్ హోటల్ వల్ల 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. 100 రూమ్స్ కు 1500 ఉద్యోగాలు ఎలా వస్తాయి. 5 స్టార్ హోటల్ కు పేరు మార్చి రూ. వేల కోట్లు విలువైన ఆస్తిని దోచిపెట్టారు. పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. ప్రవేట్ హోటల్ కు టీటీడీ స్థలం దారాదత్తం చేయడం దారుణం’ అని కరుణాకర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: MP Jairam Ramesh: గాంధీ, నెహ్రూపై ద్వేషమే.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలం.. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్
శ్రీవారికే 3 నామాలు పెడతారా?
ఒబెరాయ్ గ్రూప్ నకు స్థలం కేటాయించడం ద్వారా టీటీడీకి వచ్చిన లాభం ఏంటని భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నించారు. దీని వల్ల రూపాయి ఆదాయం లేదని స్పష్టం చేశారు. ‘ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజు సర్దుబాటు చేశారు. రూ.26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు పెడతారా?. జిల్లా కలెక్టర్ కూడా నైతిక బాధ్యత వహించాలి. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి. ఎర్ర చందనం దుంగలు ఏమయ్యాయి, సమాధానం చెప్పాలి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. రెవెన్యూ ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నా టీటీడీ స్థలం ఇచ్చారు. స్వామీజీలు దీనిపై పోరాటం చేయాలి’ అని టీటీడీ మాజీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.

