Ashok Gajapathi Raju: టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు హర్యానాకు ప్రొఫెసర్ ఆషిం కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా కూడా నియమితులయ్యారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కుతుందని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆ ప్రచారం అంతా ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఈ నియామకం పట్ల తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ గజపతి రాజును గోవా రాష్ట్రానికి గవర్నర్ నియమించడం గర్వకారణమని.. దశాబ్దాలుగా ప్రజా సేవలో వారి కృషి అనిర్వచనీయం అని టీడీపీ సీనియర్లు కొనియాడుతున్నారు. ‘ ఏ బాధ్యతలు వారికి అప్పగించినా సరే తన వంతు సమర్థవంతమైన కృషి చేస్తూ, ఆ పదవికే వన్నె తెచ్చే నాయకులు అశోక్ గజపతి రాజు. గవర్నర్‌గా సరికొత్త బాధ్యతలు చేపట్టబోతున్న రాజుకు హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ సహకారం అందించాలి’ అని తెలుగు తమ్ముళ్లు ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.
Read Also- YSRCP: ఇంటింటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాలు!
రాజ్‌భవన్‌కు రాజుగారు..!
గవర్నర్ పదవుల విషయంలో ఈ మధ్య తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతే ఇస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటి వరకూ చాలా మందే తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులయ్యారు. తాజాగా రాజు గారు రాజ్ భవన్‌కు నియమితులు కావడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనా రెడ్డిలకు గవర్నర్ పదవులు దక్కాయి. తాజాగా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ పదవి దక్కింది. ఒక గొప్ప నాయకుడికి మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి టీడీపీ, బీజేపీ తరఫున చాలా మందే ఆశావహులు ఉన్నారు. ముఖ్యంగా వర్ల రామయ్య లాంటి వారు గవర్నర్ గిరి కోసం కొన్నేళ్లుగా ఎదురుచూపుల్లోనే ఉన్నారు. ఈసారైనా ఆ పదవి దక్కుతుందని ఆశించారు కానీ, రామయ్యను కాదని రాజుకు గవర్నర్ గిరి దక్కింది. దీంతో వర్ల వీరాభిమానులు, అనుచరులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఎవరీ అశోక్?
పూసపాటి అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు. జూన్ 16, 1951న విజయనగరంలో జన్మించారు. ఆయన విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందినవారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాణా కుటుంబానికి సంబంధించినది. అశోక్ తల్లిదండ్రులు పూసపాటి విజయరామ గజపతి రాజు, కుసుమ్ మాదాగావ్‌కర్. తండ్రి కూడా పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరం సంస్థానాధిశుడిగా, ప్రముఖ దేవాలయాల ధర్మకర్తల మండలి చైర్మన్‌గా కూడా ఉన్నారు (ముఖ్యంగా సింహాచలం దేవస్థానం, రామతీర్థం ఆలయం). 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన పిలుపు మేరకు పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 1994, 1999, 2009లలో తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి, మొత్తం 7 సార్లు శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన రాజకీయ జీవితంలో 2004లో మాత్రమే ఓటమి పాలయ్యారు.
మంత్రిగా, కేంద్ర మంత్రిగా..!
ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం అశోక్‌కు ఉన్నది. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, ప్రణాళికా.. రెవెన్యూ వంటి పలు కీలక మంత్రిత్వ పదవులు నిర్వహించారు. సుమారు 13 సంవత్సరాల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత, 2024 ఎన్నికలలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా, తన కుమార్తె అదితి గజపతి రాజును రంగంలోకి దించారు. ఇటీవలి కాలంలో, ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ పదవికి అశోక్ గజపతి రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తొలుత తమిళనాడు గవర్నర్‌గా ఆయన్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయనకు ఉన్న గౌరవం, నిజాయితీపరుడిగా ఉన్న పేరు కారణంగా ఆయన్ను గవర్నర్‌గా చేయాలని సీఎం చంద్రబాబు, పార్టీ సీనియర్లు కేంద్రానికి ప్రపోజల్ పెట్టారు. ఇవన్నీ పరిశీలించిన మోదీ సర్కార్.. గోవా గవర్నర్‌గా నియమిస్తూ సోమవారం ప్రకటన చేసింది. ఈ నియామకం పట్ల కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు.]
Read Also- Stuntman Raju: షాకింగ్.. ఇండస్ట్రీలో మరో విషాదం.. మాస్టర్ ప్రాణం తీసిన స్టంట్..!
సీఎం చంద్రబాబు: గోవా గవర్నర్‌గా నియమితులైనందుకు అశోక్ గజపతి రాజుకు నా తరపున హృదయపూర్వక అభినందనలు. ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. ఈ గౌరవప్రదమైన పదవిని ఆయనకు అందించినందుకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అశోక్ ఈ ప్రతిష్టాత్మక పాత్రలో విజయవంతమైన, సంతృప్తికరమైన పదవీకాలాన్ని కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆయన దీర్ఘకాల రాజకీయ అనుభవం, నిజాయితీ, పరిపాలనా దక్షత గోవా రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు.
నారా లోకేష్: అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులైనందుకు నా హృదయపూర్వక అభినందనలు! ఇది నిజంగా ఆయన నిజాయితీ, అంకితభావానికి దక్కిన గౌరవం. ఈ గౌరవాన్ని ఆయనకు అందించినందుకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి, ప్రధాని నరేంద్ర మోదీ జీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అశోక్‌కు ఉన్న నిజాయితీ, నిజాయితీ, ప్రజాసేవ పట్ల అంకితభావం గవర్నర్ కార్యాలయానికి గొప్ప గౌరవాన్ని తీసుకువస్తాయని, మీరు వ్యక్తం చేసిన విశ్వాసంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత గోవా రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నియామకం ద్వారా ఆయన ప్రజాసేవను కొనసాగించడానికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడటానికి ఒక గొప్ప అవకాశం లభించింది. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
Read Also- Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైంది.. ఆందోళనలో ఫ్యాన్స్.. తారక్ ఆరోగ్యంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం