రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం వాతావరణం మేఘావృతమై ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలిక వర్షాలు కురిశాయి. ఇదే వాతావరణ పరిస్థితులు ఇవాళ, రేపు (ఆదివారం, సోమవారం) కూడా కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం అమరావతి కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయల సీమలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
సోమవారం కూడా వర్షాలు
రాష్ట్రంలోని ఉత్తరకోస్తా, యానాంలలో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాలో కూడా ఇదే వాతావరణం ఉంటుందని తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బలహీనపడ్డ ఉపరితలద్రోణి
ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు శుక్రవారం ఆవరించి ఉన్న శనివారం బలహీనపడింది. మధ్య అస్సాం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని భారత వాతవరణ విభాగం వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని తెలిపింది. ఇక, పశ్చిమ రాజస్థాన్ నుంచి తూర్పు రాజస్థాన్, వాయవ్య మధ్యప్రదేశ్ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని వివరించింది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాంలలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది.
Also read: Sajjala Ramakrishna: సజ్జలకు కీలక పదవి.. భగ్గుమంటున్న పార్టీ క్యాడర్?