Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీ హైదరాబాద్ నివాసంలో శనివారం ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో గురువారం ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. రాయదుర్గంలోని వంశీ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు… ముఖ్యంగా ఆయన మొబైల్ ఫోన్ పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులోనే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉండటంతో దాని మీదే దృష్టి సారించినట్లు సమాచారం. వంశీ సాధారణ కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్ ఎక్కువగా మాట్లాడతారని అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన సమయంలో ఆయన ఫోన్ లభించకపోవడం గమనార్హం.
ఇదిలాఉండగా, వంశీ కస్టడీ కోసం పోలీసులు ఇప్పటికే పిటిషన్ వేశారు. అందులో ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతిని కోరారు. కాగా, అరెస్టు అనంతరం విజయవాడ అదనపు చీఫ్ మెట్రో పాలి టన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
సబ్ జైలులో ఉన్న వల్లభనేనిని శనివారం ఆయన భార్య పంకజ శ్రీ పరామర్శించారు. తన భర్తకు అక్కడ ప్రాణహాని ఉందని, ఆయనకు కేటాయించిన బ్యారక్ లో 60 సీసీ కెమెరాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బాగానే ఉన్నట్లు జైలు అధికారులు తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి: