JC Prabhakar Reddy: టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సినీ నటీ, బీజేపీ నాయకురాలు మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు ఈ చర్యలు తీసుకున్నారు. దాదాపు నెల రోజుల క్రితం మాధవీలతకు, జేసీకి మధ్య చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా ఈవెంట్ ను నిర్వహించారు. దీన్ని మాధవీలత తప్పుబట్టారు. తాడిపత్రి వంటి సున్నిత ప్రాంతంలో అర్ధరాత్రి వరకు ఇలాంటి వేడుకలు నిర్వహించడం మంచిది కాదని విమర్శించారు. దీనిపై స్పందించిన జేసీ… మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ తో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. అనంతరం ఈ వివాదం పై స్పందించిన జేసీ… క్షమాపణలు చెప్పారు. తాను ఆవేశంలో మాట్లాడానని అలా చేసి ఉండకూడదని పేర్కొన్నారు. అయినప్పటికీ జేసీ వర్గీయులు సోషల్ మీడియాలో తనను వేధింపులకు గురి చేస్తుండటం తో పాటు బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ తాజాగా మాధవీలత సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు.