Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), తన తండ్రి, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (Chandrababu) బాటలో నడుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యా శాఖతో పాటు కీలకమైన పోర్టుఫోలియోలు నిర్వహిస్తూ, తనదైన ముద్రవేస్తున్నారు. మరోపక్క తెలుగు దేశం పార్టీని దాదాపుగా అన్నీ తానై నడిపిస్తున్నారు. తీరికలేని ఈ బిజీలో కూడా కుటుంబ బంధానికి, ఆప్యాయతలకు ఎంతో విలువనిస్తుంటారు. తల్లిదండ్రులు చంద్రబాబు-భువనేశ్వరి, భార్య నారా బ్రాహ్మణి, తన ముద్దుల కొడుకు దేవాంశ్‌పై ప్రేమను చాలా సందర్భాల్లో బహిరంగ వేదికలపైనే మంత్రి లోకేష్ ప్రదర్శించారు.
కుటుంబ సభ్యుల స్ఫూర్తి, ప్రేరణ తనను ఏవిధంగా ముందుకు నడిపిస్తాయో ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పకనే చెప్పారు. ఈ మేరకు గురువారం నాడు ‘ఎక్స్’లో ఆయన పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తిదాయకంగా ఉంది. తన కుటుంబ సభ్యులు సాధిస్తున్న విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ‘‘నాన్నమో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నారు. అమ్మ ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును గెలుచుకొచ్చారు. ఇక నా భార్య భారతదేశంలోనే అత్యంత ప్రభావశీల మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఉన్నారు. మరోవైపు, నేనేమో ఎలాంటి ఎలక్షన్ కన్నా ఇంట్లో వాళ్లతో పోటీ పడమమే మహా కష్టమని గ్రహిస్తున్నాను’’ అని మంత్రి నారా లోకేష్ రాసుకొచ్చారు. తద్వారా తన కుటుంబ సభ్యుల విజయాలను కొనియాడుతూనే, వారిని స్ఫూర్తిగా తీసుకొని తాను మరింత కష్టపడాల్సి ఉందని మంత్రి చెప్పకనే చెప్పారు.
సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీ
కాగా, చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా పాలనలో సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షించినందుకుగానూ ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్ను ప్రకటించింది. ఇక, హెరిటేజ్ ఫుడ్స్‌కు అధినేత్రిగా నారా భువనేశ్వరి, సామాజిక బాధ్యత, పారదర్శకతకుగానూ ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు, నారా బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆమె పలు ప్రఖ్యాత సంస్థల ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ జాబితాలో నిలిచిన విషయం తెలిసిందే.
చంద్రబాబుకి బిజినెస్ రిఫార్మర్ అవార్డ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. జాతీయ మీడియా సంస్థ ‘ఎకనామిక్ టైమ్స్’ ఆయనకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. పాలనలో విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయల కల్పన, ఉపాధి, ఆర్థిక వృద్ధికి పాటు పడుతున్నందుకుగానూ ‘ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్’ కేటగిరిలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. తనను అవార్డ్‌కు ఎంపిక చేసినందుకుగానూ ఎకమిక్ టైమ్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సామర్థ్యాన్ని, రాష్ట్ర ప్రజల కష్టాన్ని ప్రతిబింబిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సామర్థ్యాన్ని వెలికితీసే తన ప్రయత్నాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పెట్టుబడులకు ఏపీ ఒక ఒక ప్రధాన చిరునామాగా మారిపోయిందని చెప్పడానికి ఈ అవార్డ్ ఒక నిదర్శనమని, రాష్ట్రానికి తాను అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణంగా అనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
Father wins Business Reformer of the Year. Amma brings home the ‘Golden Peacock’ award. Wife is among India’s ‘Most Powerful Women in Business’.
Meanwhile, I’m discovering that competing with this family is harder than any election! https://t.co/zW6V7jZRRf
— Lokesh Nara (@naralokesh) December 18, 2025

