Nara Lokesh: జెన్ జెడ్ నిరసనలతో హింసాత్మకంగా మారిన నేపాల్ లో ఏపీకి చెందిన పలువురు చిక్కుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాలకు చెందిన దాదాపు 200 మందికి పైగా నేపాల్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ కృషి చేస్తోంది. వారిని రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఖాట్మండులో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక విమానాలను సైతం ఏర్పాటు చేస్తోంది.
229 మంది తరలింపు…
నేపాల్ లోని పశుపతినాథ్, మానస సరోవర యాత్రల కోసం ఏపీ నుంచి వెళ్లిన సుమారు 229 మంది.. జెన్ జెడ్ అల్లర్ల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో విశాఖపట్నంకు చెందిన 108 మంది, కడపకు చెందిన 97 మంది, విజయవాడకు చెందిన 24 మంది ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఖాట్మాండ్ నుంచి ఈ విమానం నేరుగా విశాఖపట్నం చేరుకోనుంది. అక్కడి నుంచి కడపకు చెందిన వారిని ప్రత్యేక విమానాల్లో తరలించనున్నారు. విజయవాడకు చెందిన వారిని కూడా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారంతా విమానశ్రయం నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
12 మంది కోసం స్పెషల్ ఫ్లైట్
మరోవైపు నేపాల్ లోని సిమికోట్ లో చిక్కుకున్న 12 మందిని సైతం ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వారు లక్నోకు చేరుకుంటారు. ఆ తర్వాత లక్నో నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది యాత్రికులు విమానం ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమను రక్షించి.. స్పెషల్ ఫ్లైట్ లో తరలిస్తున్నందుకు వారు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
Here’s a 9:30 AM update on our relief operations for stranded Telugu people in #Nepal:
✅Hetauda: 22 safely reached India last night via special bus.
✅Simikot: Charter plane with 12 passengers en route to Nepalganj (India border); onward road transport arranged to Lucknow.… pic.twitter.com/AAVtRnPFZ8— Lokesh Nara (@naralokesh) September 11, 2025
బాధితులకు లోకేష్ వీడియో కాల్..
అంతకుముందు నేపాల్ లో చిక్కుకున్న వారిని మంత్రి నారా లోకేష్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. కేంద్రంతో మాట్లాడి క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు, హెల్ప్ డెస్క్ ను సైతం ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. దిల్లీలోని ఏపీ భవన్ లో దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. +91 9818395787 నంబర్ అందుబాటులో ఉంచారు.
Also Read: Telugu Actress: ఆ పని చేయమని బలవంతం చేశారు.. ఏడ్చినా వదల్లేదు.. హీరోయిన్ కామెంట్స్
నేపాల్ లో సంక్షోభం ఎందుకంటే?
నేపాల్‌లో సోమవారం మెుదలైన జెడ్ జనరేషన్ నిరసనలు.. మంగళవారం హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేదంతో మెుదలైన అల్లర్లు.. దానిని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చల్లారలేదు. మరింత ఉదృతంగా మారి.. నేపాల్ ను రాజకీయ సంక్షోభంలోకి నెట్టివేసే పరిస్థితులకు దారితీశాయి. ప్రధాని కేపీ ఓలీ తన పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో నేపాల్ పాలనా పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన సైన్యం.. నేపాల్ లో కర్ఫ్యూ విధించింది. నిరసనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే అణిచివేస్తామని హెచ్చరించింది.