Free Bus: తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలవుతున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఏడాది నుంచి అదిగో ఇదిగో అంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టలకేలకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని డేట్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు.. సోమవారం నాడు జీరో ఫేర్ టికెట్ (సున్నా రుసుము టికెట్) ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు ఈ పథకంపై కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఉచిత బస్సు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎంత మేర ప్రభుత్వంపై భారం పడుతోంది? మనం ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది? పథకంపై ఎలా ముందుకెళ్దాం? అని సుదీర్ఘంగా చర్చించారు.
Read Also- Hair Fall: అసలు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా?
భారం కావొద్దు..!
ఉచిత ప్రయాణంతో లబ్ధి, 100 శాతం రాయితీ వివరాలను, మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టికెట్ అన్నింటిలోనూ పొందుపరచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీ (APSRTC)కి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను సీబీఎన్ ఆదేశించారు. మరీ ముఖ్యంగా.. నిర్వహణ వ్యయాన్ని తగ్గించి లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభార్జాన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలన్నారు. భవిష్యత్తులో ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు. అంతేకాదు.. ఇందుకు అవసరమయ్యే కరెంట్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని.. అన్ని ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఏమిటీ జీరో ఫేర్ టికెట్?
ఉచిత బస్సు పథకంలో భాగంగా బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్‌ను కండక్టర్ ఇస్తారు. అంటే.. ప్రయాణికురాలి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్రీగానే ప్రయాణం అని చెప్పడానికి ఈ టికెట్ అందజేస్తారు. సున్నా రుసుము టికెట్ అన్న మాట. ఈ టికెట్‌పై బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఉచిత ప్రయాణం ద్వారా ఎంత డబ్బు ఆదా అయ్యింది? ప్రభుత్వం ఇస్తున్న 100 శాతం రాయితీ ఎంత? అనే వివరాలు ఉంటాయి. ఈ జీరో ఫేర్ టికెట్ జారీ చేయడం వల్ల పథకం అమలు తీరును పారదర్శకంగా పర్యవేక్షించవచ్చని, ఎంత మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు? అనేది స్పష్టంగా తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. ఈ పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏసీ, వోల్వో వంటి ప్రత్యేక బస్సులకు ఇది వర్తించదు. మొత్తంగా.. ఏడాది ఆలస్యమైనా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం మంచి పరిణామమే. ఇది రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.
Read Also- Perni Nani: చీకట్లో కన్నుకొట్టి కనిపించకుండా పోయిన పేర్ని నాని!