Sharmila on YCP: మాజీ సీఎం జగన్ (Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైసీపీ పార్టీ (YSRCP)పై ఆయన సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదని ఘాటు విమర్శలు చేశారు. వారి కళ్లకు కమ్మిన బైర్లు ఇంకా తొలగినట్లు లేదన్న షర్మిల… ఇప్పటికీ అద్దంలో చూసుకుంటే చంద్రబాబు ముఖమే వారికి కనిపిస్తోందని సెటైర్లు వేశారు.
చెప్పుతో కొట్టినట్లు తీర్పు..
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి సీఎం చంద్రబాబే (CM Chandrababu) కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను షర్మిల తిప్పికొట్టారు. స్వయంశక్తితో వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. వారి నీచపు చేష్టలు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను వ్యాప్తి చేయడం ఇంకా మానుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ జన్మకు మారరు
నిజాలు జీర్ణించుకోలేని వైసీపీ నేతలు.. ఇక ఈ జన్మకు మారరని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైందని షర్మిల అన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi)కి వైసీపీ అధినేత దత్తపుత్రుడిగా ఉన్నారని పరోక్షంగా షర్మిల విమర్శించారు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్న షర్మిల.. ప్యాలెస్ లు కట్టుకొని ఖజానాను నింపుకున్నారని ఆక్షేపించారు.
ప్రజల ఆస్తులపై కన్నేసి..
ల్యాండ్ టైటిల్ యాక్ట్ (Land Title Act) తెచ్చి ప్రజల ఆస్తులు కాజేసేందుకు వైసీపీ నేతలు (YCP Leaders) ప్రయత్నించారని షర్మిల ఆరోపించారు. రిషికొండ (Rishikonda)ను కబ్జా చేయాలని చూశారని మండిపడ్డారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశానికి మద్దతు ఇచ్చి గత ఐదేళ్లుగా ప్రధాని మోదీ సేవలో తరించారని సెటైర్లు వేశారు. ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) బిడ్డగా తనకు పట్టలేదని అన్నారు.
Also Read: Street Dogs benefits: వీధి కుక్కలే కదా అని తేలిగ్గా తీసేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు
రాష్ట్రంలో BJP అంటే బాబు (B), జగన్ (J), పవన్ (P) అని షర్మిల అన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని అన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లి పోరాడే దమ్ము వైసీపీ అధినేతకు లేకుండా పోయిందని షర్మిల ఎద్దేవా చేశారు. మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు ? అంటూ వైసీపీ అధినేత జగన్ ను నిలదీశారు.