CM Chandrababu – Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates)తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ భేటిలో ఇరువురు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు స్వయంగా తెలియజేశారు. తమ మధ్య జరిగిన కీలక ఒప్పందాల గురించి ఎక్స్ (Twitter) వేదికగా చంద్రబాబు పంచుకున్నారు.
భేటిలో ఏం చర్చించారంటే
బిల్ గేట్స్ తో భేటి సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు. బిల్ గేట్స్ తో అద్భుత సమావేశం జరిగిందన్న ఆయన.. ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించినట్లు చెప్పారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించినట్లు చెప్పారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 కలలు సాకారం చేసేందుకు ఏపీ సర్కార్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గేట్స్ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం రాష్ట్ర ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పాటు అందిస్తుందని ఎక్స్ లో స్పష్టం చేశారు.
‘బిల్ గేట్స్ కు థ్యాంక్స్’
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. రాష్ట్ర పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటి కావడాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు స్వాగతిస్తున్నారు. రాష్ట్ర దశ దిశ మార్చే భేటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టేసిన హైకోర్టు
మూడేళ్లలో మూడోసారి
మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రస్తుతం భారత్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన తాజాగా భేటీ కూడా అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించారు. అయితే బిల్ గేట్స్ గత మూడేళ్లలో మూడు సార్లు భారత్ లో పర్యటించడం గమనార్హం.