Ananthapur District: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యా సంస్థలు ముఖ్య భూమిక పోషిస్తుంటాయి. అందుకే దేవాలయాల తర్వాత అంతటి పవిత్రత కలిగిన ప్రాంతాలుగా స్కూళ్లు, పాఠశాలలను పరిగణిస్తుంటారు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి, చెడులు నేర్పించి గొప్ప పౌరులుగా స్కూళ్లు తీర్చుదిద్దుంటాయి. అటువంటి ఓ స్కూల్ పై దుండగుల కన్ను పడింది. చిన్నారులు చదువుకునే ఆ ప్రాథమిక పాఠశాలలో వీరంగం సృష్టించారు.
క్లాస్ రూంలో మూత్రం
ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ సెంట్రల్ ప్రాథమిక పాఠశాల.. నిత్యం విద్యార్థులతో కలకలలాడుతుంటుంది. ఉపాధ్యాయుల పాఠాలు, చిన్నారుల కేరింతలతో నిత్యం ఆ స్కూల్ మార్మోగుతుంటుంది. చుట్టు పక్కల ఉండే వారంతా తమ పిల్లలను ఆ స్కూల్ లోనే చేర్పించి చదువు చెప్పిస్తుంటారు. అటువంటి ఆ పాఠశాలను రోజూ వారీగా ఇవాళ ఉదయం కూడా తెరిచి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. గుర్తు తెలియని దుండగులు క్లాస్ రూంలోనే మద్యం సేవించి అక్కడే బాటిళ్లు పగలకొట్టారు. ఆపై మూత్ర విసర్జన చేశారు.
పాఠశాలలో చోరీ
అంతటితో ఆగకుండా ఉరవకొండ సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో దుండగులు మరింత విధ్వంసం సృష్టించారు. గ్రిల్ తలుపులు పగలకొట్టి 2 ఫ్యాన్లు ఎత్తుకెళ్లారు. అలాగే ఫ్లోరింగ్ టైల్స్, స్విచ్ బోర్డులు, మోటార్ స్టాటర్ బోర్డులు ధ్వంసం చేశారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన ప్రధానోపాధ్యాయని నసీరా బేగం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read: Firecracker Manufacturing: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ప్రమాదానికి కారణం అదేనా!
స్థానికుల ఆగ్రహం
మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చదువుకునే ప్రాంతంలో ఇలాంటి దుశ్చర్యలు ఏంటని మండిపడుతున్నారు. ఇప్పుడు స్కూల్స్ పైనా కూడా పడ్డారా అంటూ ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్కూల్ పరిసరాల్లో పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని కూడా సూచిస్తున్నారు.