Firecracker Manufacturing: అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా, నియంత్రణ కొరవడినట్లు తేలింది. కైలాసపట్నంలో భారీ పేలుడు తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బాణాసంచా ప్రమాదంలో గాయపడ్డవారు కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, గాయపడిన వారిలో ఇద్దరిని మెడికవర్ ఆస్పత్రికి, మరో ముగ్గురిని నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నంలో ఆరు మృతదేహాలకు, అనకాపల్లిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మరోవైపు బాణాసంచా పేలుడుపై కోటవురట్ల పీఎస్లో కేసు నమోదైంది.
ప్రమాదం ఎలా?
భారీ పేలుడు వెనుక కారణం ఏమై ఉంటుందని నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్, అనకాపల్లి, నర్సీపట్నం సబ్‌డివిజన్‌కు చెందిన క్లూస్ టీమ్‌లు భౌతిక సాక్ష్యాధారాలను సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్‌లైట్ల వెలుతురులో 20కి పైగా నమూనాలు తీసుకున్నారు. అందులో పొటాషియం, సల్ఫర్‌తో పాటు బాంబుల తయారీకి వాడే మందుగుండు సామగ్రి, ఇతర ముడిపదార్థాలను నిపుణులు గుర్తించారు.
Also read: Bike Caught Fire: నడిరోడ్డుపై నడుస్తున్న బైక్ దగ్ధం.. ఎక్కడంటే!
ఘటనా స్థలంలో మొత్తం 8 షెడ్లు ఉండగా, వాటిలో మూడింట బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రెండు షెడ్లు స్టాకు పాయింట్లు కాగా మిగిలినవి కార్మికుల అవసరాలకు ఉంచారు. ఈ షెడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు ప్రమాదఘటనాస్థంలో ఇంకా ఏమైనా బాణసంచా సామగ్రి మిగిలిపోయిందేమోనని పరిశీలిస్తున్నారు. అక్కడక్కడ చిన్నగా వస్తున్న పొగలను సిబ్బంది ఆర్పేసింది. మిగిలిపోయిన బాణసంచాను భూమిలో పాతిపెట్టారు.