15-foot Snake: సాధారణ పామును చూస్తేనే మనం భయపడుతుంటాం.. అదే దాదాపు 15 అడుగుల పాము అంటే.. ఇక అంతే సంగతి. గుండె జల్లుమనడం ఖాయం. అది కూడా అతి విషపూరితమైన పాము అని తెలిస్తే మన పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి ప్రాంతంలో ఇలాంటి సంఘటనే రైతులను భయాందోళనకు గురిచేసింది. స్థానిక పొలాల్లో పనిచేస్తున్న రైతుల మధ్యలో ఒక్కసారిగా 15 అడుగుల పొడవైన భారీ పాము కనిపించడంతో అక్కడ కలకలం రేగింది.
దేవరాపల్లి పరిసరాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఓ భారీ పాము అకస్మాత్తుగా బయటపడింది. ఆ సమయంలో పొలాల్లో ఉన్న కుక్కలు ఈ పామును గమనించి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కుక్కలు మొరగడం, దాని వెంట పడటంతో పాము రైతుల వైపు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న రైతులు భయంతో వణికిపోయి పరుగులు తీశారు.
ఈ భారీ పాము ఏ జాతికి చెందినది అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, దాని పరిమాణం చూసిన రైతులు ఏ మాత్రం ఆలోచించకుండా అక్కడి నుంచి పారిపోయారు. సాధారణంగా ఈ ప్రాంతంలో కొండచిలువలు లేదా ఇతర పెద్ద పాములు కనిపించడం అరుదని స్థానికులు చెబుతున్నారు. అయితే, వర్షాకాలం తర్వాత పొలాల్లో పాములు బయటకు రావడం అప్పుడప్పుడూ జరిగే సంఘటనలని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో రైతులు తమ రోజువారీ పనులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
Also Read: చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్.. తెగ వైరల్ చేస్తున్న క్యాడర్..
ఈ సంఘటనతో దేవరాపల్లి గ్రామంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రైతులు తమ పొలాలకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పాములు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానిక అధికారులు సూచించారు.
గతంలోనూ..
గత సంవత్సరం నవంబర్ నెలలో ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ గిరినాగు స్థానికులను భయపెట్టింది. 12 అడుగుల భారీ గిరినాగు స్థానికంగా ఉండే ఓ రైతు పొలంలో తిష్ట వేసింది. జనం చూస్తుండగానే ఓ రక్తపింజరను వేటాడి మరీ మింగేసింది. అది చూసిన అక్కడి వారంతా భయంతో పరుగు అందుకున్నారు.
వెంటనే స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో అటవీ శాఖ సిబ్బంది వారు స్నేక్ స్నాచర్స్‌ను పిలిపించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దూరంగా ఉన్నా అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ గిరినాగు తాలూకు వీడియో బయటకు రావడంతో నెట్టింట అప్పట్లో వైరల్ అయ్యింది.
2022లోనూ ఓ సారి..
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో రెండు సార్లు గిరినాగు అనే పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రపంచంలోనే విషపూరితమైన పాముగా పేరున్న 15 అడుగులున్న గిరినాగు పాము పొలంలో పనిచేస్తున్న రైతు కంటపడడంతో ఉరుకులు, పరుగులతో వెళ్లి అతడు గ్రామస్తులు వివరించాడు.
దీంతో వారు ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సొసైటీ సభ్యులు కొన్ని గంటల పాటు శ్రమించి విషపు పామును పట్టుకుని అటవీప్రాంతంలో వదిలివేశారు. ఆ ఘటనకు రెండు రోజుల కిందట అదే మండలం లక్ష్మీపేటలో 12 అడుగుల గిరినాగును అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
అయితే అనకాపల్లి జిల్లాలో ఇలాంటి పొడవైన పాములు కన్పించడం కొత్తేం కాదని ప్రజలు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే చూసామని వారు చెబుతున్నారు. ఈ భారీ పాములు అధికంగా పంటపొలాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తున్నది. అనేక సార్లు ఇవి రైతుల కంట్లో పడటంతో వారు వెంటనే స్నేక్ స్నాచర్స్‌కు సమాచారం అందించేవారు. స్నేక్ స్నాచర్స్ పాములను పట్టుకొని దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదలేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.