Kasibugga Temple Stampede: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో ఆలయం ఉన్నందున భక్తుల తాకిడికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు.
దుర్ఘటనకు 11 కారణాలు..
దుర్ఘటనకు కారణమైన కాశీబుగ్గలోని వేంకటేశ్వర ఆలయం.. హరి ముకుంద్ అనే ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోంది. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో నిర్మించిన ఈ ఆలయం.. స్థానికంగా చిన్న తిరుపతిగా గుర్తింపు పొందింది. ప్రతీరోజు వెయ్యిమంది భక్తులు ఇక్కడి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ఇది కార్తికమాసం కావడం అందులోనూ ఇవాళ ఏకాదశి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే కావడం.. అది కూడా మెట్ల గుండా వెళ్లాల్సి రావడంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మెట్లపక్కన ఉన్న రైలింగ్ పై ఒత్తిడి పెరిగి.. అది ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో గ్రిల్ తో పాటు భక్తులు దాదాపు 5-7 అడుగుల ఎత్తు ఉన్న మెట్ల నుంచి కిందపడిపోయారు. ఒకరిమీద ఒకరు పడిపోవడంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన వెనుక ప్రధానంగా 11 కారణాలు కనిపిస్తున్నాయి.
1. ఏకాదశి ఏర్పాట్లకు తగిన అనుమతి తీసుకోలేదు.
2. దర్శనానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఒకటే క్యూలైన్
3. ఆలయంలో ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు.
4. పనులు జరుగుతున్న చోటే తొక్కిసలాట
5. బలహీనంగా ఉన్న క్యూలైన్ రైలింగ్
6. రద్దీకి తగ్గ వాలంటీర్లు లేక పోవడమూ కారణమే
7. రద్దీ భారీగా ఉన్నా పోలీసు సాయం తీసుకోక పోవడం.
8. నిర్వాహకుల అంచనా 3వేలు. వచ్చిన భక్తులు 25వేల మంది
9. ప్రభుత్వం వద్ద లేని ఆలయ వివరాలు
10. ఇలాంటి ఆలయాలపై దేవదాయశాఖ నిఘా లేమి
11. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని అంచనా లేకపోవడం.
దోషులపై కఠిన చర్యలు: సీఎం
శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu).. తొక్కిసలాట ఘటనపై స్పందించారు. అత్యంత బాధాకరమైన ఘటన కాశీబుగ్గలో చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరమని అన్నారు. దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం కూడా పాటించారు. ‘ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం విచారకరం. ముందుగానే పోలీసులకు చెప్పి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు అవకాశం ఉండేది. ప్రతీ ఒక్కరి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొందరు ప్రైవేటు వ్యక్తుల కారణంగా తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ గా వ్యవహరిస్తాం’ అని పేర్కొన్నారు.
Also Read: Kasibugga Temple Tragedy: ప్రైవేటు ఆలయం అంటే ఏమిటి?, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వానికి సంబంధం లేదా?
ప్రధాని మోదీ సంతాపం..
కాశీబుగ్గ దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగాలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఘటన పట్ల సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
